శ్రీప్రకాశ్ సింగ్ రఘువంశీ దేశీ విత్తన బ్రహ్మ!

శ్రీప్రకాశ్ సింగ్ రఘువంశీ దేశీ విత్తన బ్రహ్మ!


పంట చేనులో ప్రతి మొక్కా ఆయనకు నేస్తమే. ప్రతి మొక్కనూ ప్రతి రోజూ కొత్తగా చూస్తాడు.. ఆత్మీయ స్పర్శతో పలుకరిస్తాడు. ఒకే పంట పొలంలో ప్రత్యేకతలున్న మొక్కలను ఆయన కళ్లు ఇట్టే పట్టేస్తాయి. ఆయనకున్న కంటి చూపు(పెన్సిలిన్ వికటించిన ఫలితంగా) అంతంత మాత్రమే అయినా.. ఆయన నిశిత పరిశీలనా దృష్టి నుంచి ఏ మొక్కా తప్పించుకోలేదు! గోధుమ, వరి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలు.. పంట ఏదైనా సరే.. పనికొచ్చే ప్రత్యేక లక్షణాలున్న మొక్కలను వేరుచేసి.. ఐదారేళ్లలో తనదైన ముద్రతో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక దేశీ వంగడాన్ని రైతులకు అందిస్తాడు. వందలాది అధిక దిగుబడినిచ్చే దేశీ వంగడాలను విస్తృత స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చిన ఈ విశిష్ట రైతు శాస్త్రవేత్త పేరు శ్రీప్రకాశ్ సింఘ్ రఘువంశీ. 15 రాష్ట్రాల్లోని లక్షకు పైగా రైతులు లక్షలాది ఎకరాల్లో రఘువంశీ రూపొందించిన విత్తనాల వల్ల బంగారు పంటలతో పచ్చగా ఉన్నారు.

 

 అపురూపమైన ఈ విత్తన సంపదను తమ తోటి రైతులకూ అందిస్తున్నారు. సొంత విత్తనం ఇచ్చిన భరోసాతో వారు అప్పులను, అధైర్యాన్ని జయిస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు రాష్ట్రపతి అవార్డును అందుకున్న రఘువంశీ విజయగాథ.. భారతీయ రైతుల సృజనశీలతను, శక్తి సామర్థ్యాలను, విత్తన స్వాతంత్య్ర వైభవాన్ని ఎలుగెత్తి చాటే కీర్తి పతాక! కంపెనీల కోసం కాకుండా సొంతంగా విత్తనోత్పత్తి చేస్తే ఎకరానికి ఏటా రూ. 2 లక్షల ఆదాయం పొందొచ్చని, అప్పుల్లోంచి, ఆత్మహత్యకు పురికొల్పే బాధల నుంచి విముక్తి పొందొచ్చని రఘువంశీ అంటున్నారు. ‘ఉమ్మడి విత్తనాల (ఓపెన్ సోర్స్ సీడ్)’ నెట్‌వర్క్ చర్చాగోష్టిలో పాల్గొనడానికి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రఘువంశీ ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..

 

 చిన్నప్పుడే కంటి చూపు దెబ్బతిన్నప్పటికీ దేశీ వంగడాల అభివృద్ధిపై పరిశోధనను ఎలా కొనసాగించగలుగుతున్నారు?

 మా నాన్న టీచర్. వ్యవసాయమూ ఉండేది. నేను 8వ తరగతి చదివే రోజుల్లో జ్వరం వస్తే డాక్టర్ పరీక్షించకుండానే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ రియాక్షన్ వల్ల కళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని నెలలు మంచంలోనే ఉన్నా. ఇప్పటికీ ఎండతో ఇబ్బందే. అందుకే నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటా. తలకూ ఎండ తగలకూడదని తెల్ల టోపీ పెట్టుకుంటున్నా. దేముడు ఇలా చేశాడని నేను బాధపడటం లేదు. చూపు దెబ్బతినడమే ఒకరకంగా మంచిదైంది. ఇలాగైంది కాబట్టే అప్పుడే చదువు మానేసి వ్యవసాయంలో ఉండిపోయా. లేకపోతే ఉద్యోగమో, వ్యాపారమో చేసేవాడ్ని. కానీ, రైతుల కష్టాలు తెలిసేవి కాదు, వారికి సేవ చేయగలిగేవాడ్ని కాదు.

 

 పంట మొక్కల్లో విశిష్ట గుణాలను గుర్తించే నైపుణ్యం మీకెలా అబ్బింది?

 మా నాన్న స్నేహితుడు డాక్టర్ మహతీం సింగ్ బనారస్ యూనివర్సిటీలో ప్లాంట్ బ్రీడర్. ఆయన మా నాన్నకు విత్తనాలు ఇచ్చి, పండించి చూడమనే వాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకునేటప్పుడు విన్న మాటల ద్వారా పనికొచ్చే మొక్కలను గుర్తించడం నేర్చుకున్నాను. డా. సింగ్‌తోపాటు డా. ఉదయ్ ప్రతాప్ సింగ్ అనే మరో శాస్త్రవేత్త కూడా నాకు తోడ్పడ్డారు. గ్రామంలో రైతుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఎప్పుడు పొలానికెళ్లినా ఏదో కొత్త లక్షణాలున్న మొక్కల కోసం వెదుకుతూ ఉంటాను. ఉన్నట్టుండి కొత్తదేదో కంట్లో పడుతుంది. అదే సెలక్షన్. దేని కోసం వెదుకుతూ ఉంటామో అది తప్పకుండా దొరుకుతుంది. ఎంపిక చేసిన ప్రత్యేక లక్షణాలున్న మొక్కల గింజలను సేకరించి, వాటిని ప్రత్యేకంగా పెంచుతాను. కేళీలు ఏరేస్తూ.. మంచి గుణాలున్న మొక్కల గింజలు సేకరించి.. మళ్లీ జాగ్రత్తగా పండిస్తాను. ఇలా కొత్త వంగడం సిద్ధం కావాలంటే 5-6 ఏళ్ల కాలం పడుతుంది. ఇదే సెలక్షన్ లేదా ఎంపిక చేయడటం అంటే.

 ప్రకృతి వైపరీత్యాలను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మీ వంగడాలు ఎలా దోహదపతాయి?

 

 తుపానులు, నీటి ఎద్దడిని తట్టుకునే దేశీ వంగడాలున్నాయి. ఆర్‌కే-5 వరి వంగడం హుద్‌హుద్ తుపానును సైతం తట్టుకొని నిలబడింది. వెన్నుకు ఆనుకొని ఉండే ఆకులే వెన్నును రక్షించాయి. బలమైన గాలులను సైతం తట్టుకుంటుంది. ఎకరానికి 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది.

 

 హైబ్రిడ్ విత్తనాల అవసరం లేదా?

 హైబ్రిడ్ విత్తనాల అవసరమే లేదు. తిరిగి వాడుకునేందుకు వీలైన సూటి (ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్) రకాల్లోనూ మెరుగైన ఆప్షన్లున్నాయి. సెలక్షన్ బ్రీడింగ్‌లోనే మంచి ఫలితాలొస్తున్నాయి. సూటి రకాలనే వాడాలి. సేంద్రియ వ్యవసాయమే చేయాలి.

 

 రైతులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

 రైతులు పంటలు పండించి అమ్మటంతోపాటు.. విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్మటం ద్వారా అధికాదాయాన్ని పొందొచ్చు. కంపెనీల కోసం విత్తనాలు పండించి, ఆ కంపెనీల నుంచే విత్తనాలు కొనుక్కోవడం కన్నా రైతుకు మరో దౌర్భాగ్యం లేదు. అప్పులతో, పేదరికంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేనిచ్చిన విత్తనాలతో సొంత విత్తనాలు తయారు చేసుకొని, ఇతర రైతులకు అమ్ముకొని సంతోషంగా ఉండమని రైతులకు విజ్ఞప్తి చేస్తుంటాను. ధాన్యం పండిస్తే వచ్చే దానికన్నా విత్తనాలు పండిస్తే ఎక్కువ రాబడి ఉంటుంది. ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం పొందొచ్చు.

 

 వంగడాలు.. పురస్కారాలు..

శ్రీప్రకాశ్ సింగ్ రఘువంశీ(61) స్వగ్రామం వారణాసి(ఉత్తరప్రదేశ్) కి 30 కిలోమీటర్ల దూరంలోని తాండియ. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. కుమారులు ముగ్గురూ తండ్రితోపాటు వ్యవసాయంలో, వంగడాల అభివృద్ధి కృషిలో కొనసాగడం విశేషం. 9-10 ఎకరాల సొంత పొలంలో పంటలు సాగు చేసుకుంటూ.. మరో 3.5 ఎకరాలను వంగడాలపై పరిశోధన, అభివృద్ధికి కేటాయించారు. రైతు శాస్త్రవేత్తగా చక్కని వంగడాలను అభివృద్ధి చేసినందుకు అబ్దుల్ కలామ్, ప్రతిభా పాటిల్‌ల చేతుల మీదుగా 4 సార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. 2010-11లో ప్లాంట్ జీనోమ్ సేవియర్ పురస్కారాన్ని అందుకున్నారు. సేంద్రియ సేద్యంలో అధిక ఉత్పాదకత, తెగుళ్లు- పురుగులను తట్టుకునే శక్తి, పడిపోకుండా ఉండటం, బెట్టను తట్టుకోవటం, మెట్ట సేద్యానికి అనువుగా ఉండటం, నాణ్యమైన పంట దిగుబడి.. ఇవీ రఘువంశీ దేశీ వంగడాల ప్రత్యేకత.

 - హైబ్రిడ్ వంగడాల అవసరమే లేదంటారాయన. గత పాతికేళ్లలో ఆయన రూపొందించిన వంగడాల్లో కొన్ని.. 80 గోధుమ, 20 వరి, 20 కంది, 22 కూరగాయలు, 3 ఆవ వంగడాలు. ఇవన్నీ తిరిగి వాడుకోవడానికి అనువైన సూటి రకాలే.

 - ‘కుద్రత్’(ప్రకృతి) అనే బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చారు. కుద్రత్-9 అనే బ్రెడ్ గోధుమ వంగడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వంగడాలు- రైతు హక్కుల పరిరక్షణ ప్రాథికార సంస్థ’ 2012లో గుర్తింపునిచ్చింది. మరో 4 వంగడాలు రిజిస్ట్రేషన్ క్రమంలో ఉన్నాయి.

  -    ఆయన వెలువరించిన తొలి వరి వంగడం ‘రెడ్ బాస్మతి’ (141-150 రోజులు). వడ్లు ఎర్రగా, బియ్యం తెల్లగా ఉంటాయి. ఎత్తుగా పెరుగుతుంది. ఎకరానికి 20-22 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది.

      - కుద్రత్-5 సన్న వరి వంగడం(125-130 రోజులు) ఎకరానికి 30-31 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.

  -    తెలుగు రాష్ట్రాలకు అనువైన కంది వంగడం ‘కుద్రత్ చమత్కార్’(170 రోజులు). ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.

  -    5-6 అడుగుల పొడవు పెరిగే సొర వంగడాన్ని రఘువంశీ అభివృద్ధి చేశారు. జ్యూస్ చేసుకోవడానికిది అనువైనది.

  -    కుద్రత్ కరిష్మా అనే కంది(220 రోజులు) 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అరడుగు ఎత్తు నుంచే దీనికి కొమ్మలు వస్తూ మొక్క గుమ్మటంగా పెరుగుతుంది.

  -    పెసర(55 రోజుల) వంగడం. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది.

 

 రైతులకు శిక్షణ ఇస్తారా?


గ్రామాలకు వెళ్లి చర్చాగోష్ఠులు, సదస్సులు పెట్టి 100 నుంచి 500 గ్రాముల విత్తన ప్యాకెట్లను ఉచితంగా పంచుతున్నాను. ‘బీజ్ దాన.. మహా దాన’ అనేది నా నినాదం. విత్తనాలు కావాలనుకునే రైతులు నాకు 0983 925 3974 నంబర్‌కు ఫోన్ చేసి హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడొచ్చు. లేదంటే.. నాకు ఇంగ్లిష్‌లో పూర్తి పోస్టల్ అడ్రస్(పిన్‌కోడ్ సహా)ను ఎస్‌ఎంఎస్ పంపినా చాలు, నా సొంత ఖర్చులతోనే పోస్టు ద్వారా మచ్చుకు కొన్ని విత్తనాలు పంపిస్తాను. సొంత విత్తన నిధులను ఏర్పాటు చేసుకుంటే దారిద్య్రం పోతుంది. వంగడాల ఎంపికకు సంబంధించిన మెలకువలను రైతులకు వివరంగా నేర్పించడానికి సిద్ధమే.

 

 గమనిక: వరి తదితర పంట పొలాల్లో నుంచి మంచి రకాల ఎంపిక (‘పార్టిసిపేటరీ ప్లాంట్ బ్రీడింగ్’)పై వారణాసి(ఉత్తరప్రదేశ్) వద్ద శ్రీప్రకాశ్ సింగ్ రఘువంశీ పొలంలోనే 2016 ఫిబ్రవరిలో(2-3 రోజుల) శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి.రాజశేఖర్ (083329 45368) ఈ శిక్షణకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రఘువంశీ హిందీ మాటలను ఆయన తెలుగులోకి అనువదించి చెబుతారు. ఆసక్తి గలవారు 040-27017735 నెంబర్‌కి ఫోన్ చేసి, పేరు నమోదు చేసుకోవచ్చు.

 - ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top