కందిలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు మేలు


పెసర   

 ఎల్‌బీజీ-407, 457, 450, 410 రకాలు ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలం. మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పై భాగాన కాయలు కాస్తాయి. ఇవి పల్లాకు, వేరుకుళ్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్లను తట్టుకుంటాయి. వరి మాగాణుల్లో అయితే నీటి తడి అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. పెసర, అలసంద, మినుమును రబీ కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేసుకోవాలి.



 అలసంద

 స్థానికంగా దొరికే విత్తనాలను రైతులు సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. ఎం-45 మందుతో కలిపి శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించవచ్చు. చివరి దుక్కిలో 50 కిలోల డీఏపీ వేసుకోవాలి.

 

మినుము   

 ఎల్‌బీజీ-752, ఎల్‌బీజీ-20, 623 రకాలను సాగు చేసుకోవచ్చు. 70-80 రోజుల్లో పంట చేతికొస్తుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 6-7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 752, 20 విత్తన రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. ఎల్‌బీజీ-623 రకం బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. ఈ విత్తనాలను నాటుకోవచ్చు, వెదజల్లుకోవచ్చు. ఎల్‌బీజీ-645 రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవుగా ఉంటాయి. కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనాలను శుద్ధి చేస్తే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు.

 

ఆముదం

 స్థానికంగా దొరికే రకాలతో పాటు క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్, జ్వాలా హైబ్రిడ్ రకాలైన జీసీహెచ్-4,  డీసీహెచ్-177, 519 రకాలను సాగు చేసుకోవచ్చు. క్రాంతి రకం త్వరగా కోతకు వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత, జ్యోతి రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. విత్తిన 7-10 రోజుల్లో మొలక వస్తుంది. 15-20 రోజుల తర్వాత కనుపునకు ఒకే మొక్క ఉండేలా.. చుట్టూ ఉన్న మొక్కలను పీకేయాలి. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. వివిధ రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top