ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న యువ కిరణం

ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న  యువ కిరణం


తొలిపంటలోనే అధిక దిగుబడి!



రసాయన ఎరువులు,  క్రిమిసంహారక మందుల వల్ల పెట్టుబడి పెరుగుతున్నా నికరాదాయం తగ్గిపోతుండడంతో సాగు నానాటికీ

 కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలువురు రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి రాణిస్తున్నారు. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన పలువురు యువ రైతులు దేశవాళీ ఆవులను సమకూర్చుకొని ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. సేద్యాన్ని ఆశావహమైన వృత్తిగా మలచుకుంటూ తోటి రైతాంగంలో స్ఫూర్తిని నింపుతున్న యువ రైతుల్లో పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం- సేద్య పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడంలోనే ఇమిడి ఉందని సూర్యప్రకాశ్‌రెడ్డి అనుభవం చాటిచెబుతోంది.

 

‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు’ ఇదీ ప్రకృతి సూత్రం. ఈ సూత్రాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ధైర్యంగా ముందడుగేసిన రైతు బతుకూ పచ్చగా ఉంటుంది. విద్యాధిక యువ రైతు పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకృతి సేద్య అనుభవాలే అందుకు నిదర్శనం. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం తాపలకొత్తూరు గ్రామం ఆయన స్వగ్రామం. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ(వృక్షశాస్త్రం) చదివిన సూర్యప్రకాశ్ తర్వాత ఒక రసాయనిక ఎరువుల కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. తమకున్న పదెకరాల తేలికపాటి భూమికి డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేసుకొని సూర్యప్రకాశ్ తండ్రి రాఘవరెడ్డి, సోదరుడు రాజశేఖరరెడ్డి రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చీనీ(బత్తాయి), వేరుశనగ తదితర పంటలు పండించేవారు. ఎప్పటికప్పుడు నిపుణుల సూచనల మేరకు అందుబాటులోకి వచ్చిన కొత్త ఉత్పాదకాలను వాడినప్పటికీ.. ఖర్చుకు తగిన ఆదాయం రాకపోగా నానాటికీ పరిస్థితి దిగజారుతుండడం సూర్యప్రకాశ్‌ను కలవరపరచింది. ఈ పూర్వరంగంలో సాగును గిట్టుబాటుగా మార్చుకునే లక్ష్యంతో ప్రత్యామ్నాయ సేద్య పద్ధతులపై దృష్టి సారించాడు.

 

యువ రైతు జీవితాన్ని మార్చేసిన శిక్షణ




పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. 2013లో మహబూబ్‌నగర్‌లో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై లోతుపాతులను ఆకళింపుచేసుకున్నాడు. రోజుకు 10 గంటల చొప్పున ఐదు రోజులు కొనసాగిన ఈ శిక్షణ అతని జీవితాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. నవంబర్ నుంచి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాడు. నాలుగు దేశవాళీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం తయారుచేసుకొని వాడుతున్నారు. చీడపీడల అదుపునకు నిమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను పాలేకర్ సూచించిన ప్రకారం స్వంతంగా తయారుచేసుకొని వాడుతున్నాడు. తొలి ఏడాదే గణనీయమైన ఫలితాలు సాధించి గ్రామంలో రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

 

అధిక దిగుబడి.. అధిక నికరాదాయం..



తండ్రి 11 ఏళ్లనాడు మూడెకరాల్లో నాటిన చీనీ తోటను 2013 నవంబర్ నుంచి సూర్యప్రకాశ్ ప్రకృతి సేద్యంలోకి మార్చారు. బత్తాయిలో కాకర, అలసంద పంటలను అంతర పంటలుగా వేశారు. 3,500 లీటర్ల ట్యాంకులో జీవామృతాన్ని తయారు చేసి, డ్రిప్ ద్వారా పంటలకు సరఫరా చేస్తున్నారు. 2014లో 18 టన్నుల బత్తాయి పండ్ల దిగుబడి ద్వారా రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. జీవామృతం తదితరాల తయారీ, కూలీలు, రవాణా చార్జీలు, పిచికారీలకు కలిపి రూ. 25 వేల ఖర్చు పోగా.. రూ. 2 లక్షల నికరాదాయం వచ్చిందని సూర్యప్రకాశ్‌రెడ్డి ఆనందంగా చెప్పారు. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడినప్పుడు రూ. 90 వేలు ఖర్చయినా.. దిగుబడి 15 టన్నులకు మించలేదు. తొలి పంటలోనే సత్ఫలితాలు కనిపించడంతో సూర్యప్రకాశ్‌కు ప్రకృతి సేద్యం దిగుబడి, ఆదాయాల పరంగా అనుసరణీయమేనన్న భరోసా కలిగింది. ప్రస్తుతం బత్తాయిలో అంతరపంటగా కాకర, అలసంద వేశారు. వేసవిలో మునగ, బొప్పాయి అంతరపంటలుగా వేయాలనుకుంటున్నారు.  

 

అరటిలో అంతర పంటగా వేరుశెనగ



గత జూన్‌లో మూడెకరాల్లో అరటి నాటారు. అంతరపంటగా వేరుశెనగ ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 24 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. వేరుశనగ పప్పు క్వింటా రూ. 5,350ల ధర పలికింది. ఆ తర్వాత రెండో అంతరపంటగా పప్పు దోసను కేవలం రూ. వెయ్యి ఖర్చుతో సాగు చేసి రూ. 18 వేల ఆదాయం పొందారు. అరటి మరో 3 నెలల్లో గెలలు వేయనుంది. ముప్పావు ఎకరంలో పత్తిని పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 5 క్వింటాళ్ల దిగుబడి పొందారు. తమ ప్రాంతంలో తేలికపాటి నేలలో కరువు పరిస్థితుల్లో ఈ దిగుబడి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. ఇంటి అవసరాల కోసం కొద్ది విస్తీర్ణంలో గోధుమ సాగు చేస్తున్నారు.



రసాయన ఎరువులు పూర్తిగా మానేసి క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నందు వలన భూమిలో వానపాములు, మేలుచేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు సహజ పోషకాలను అందిస్తున్నాయని సూర్యప్రకాశ్ తెలిపాడు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతు తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటైన సాగు పద్ధతి నుంచి, అది ఎంత నష్టదాయకంగా ఉన్నా, కొత్త పద్ధతిలోకి మారటం అంత తేలిక కాదు. కానీ, సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడం తప్ప సంక్షోభం నుంచి బయటపడే మారో మార్గం లేదని ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ) మొత్తుకుంటున్నది. ఉన్నత విద్యావంతుడైన సూర్యప్రకాశ్ వంటి యువ రైతుల చొరవ వల్ల ఈ మార్పు దిశగా వడివడిగా అడుగులు పడే అవకాశం ఉంది.

 

 - గవిని శ్రీనివాసులు, కర్నూలు వ్యవసాయం

 

ప్రకృతి సేద్యాన్ని ప్రభుత్వం  గుర్తించి, ప్రోత్సహించాలి




రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం కొనసాగించలేని సంక్షోభ పరిస్థితి వచ్చింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు సబ్సిడీపై దేశవాళీ ఆవులను పంపిణీ చేయాలి. ఏ పంటలనైనా సాగు చేయొచ్చు. విద్యాధిక యువతకూ ఉద్యోగం కంటే ప్రకృతి సేద్యమే మిన్న. ప్రకృతి సేద్యన్ని విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే కర్నూలులో మార్చిలో పాలేకర్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరం నిర్వహించాం.

 

 - పంచలింగాల సూర్యప్రకాష్‌రెడ్డి (96038 34633),

 తాపలకొత్తూరు,

 క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా

 

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top