‘లూసన్’.. లాభాలు చూపెన్


ఘట్‌కేసర్: పశువులకు మేతగా ఉపయోగపడే లూసన్ గడ్డి సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ రైతు.. ఈ గడ్డిని పెంచడానికి అంతగా శ్రమించాల్సిన పని లేదని, నీరు ఎక్కువగా అవసరం లేదని, పెట్టుబడి కూడా తక్కువే అంటున్నాడాయన. ఈ పంటపై చీడపీడలు ఆశించే అవకాశం తక్కువ అని చెబుతున్నాడు రైతు కృష్ణ.



ఆయన ఇంకా ఏమంటున్నాడంటే... గతంలో పాడి పశువులకు లూసన్ గడ్డి వేయడంతో పాల దిగుబడి పెరుగుతుందని గ్రహించాను. దీంతో లూసన్ గడ్డికి కోసం  ప్రతి రోజు మార్కెట్ వెళ్లేవాడిని. అక్కడ ఈ గడ్డికి గిరాకీ బాగా ఉండటం చూశా. దానిని సాగు చేస్తే ఎక్కువ ఆదాయం పొందవచ్చని గ్రహించా. దీంతో యంనంపేట్‌లో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని సాగు చేస్తున్నా. లూసన్ గడ్డి విత్తనాలు తెచ్చి వాటిని పొలంలో సాగు చేస్తూ నాలుగు రోజులకోసారి నీళ్లు పెడుతున్నా. కలుపు మొక్కలను ఎప్పటికప్పడు తొలగించాలి. దీనికోసం నలుగురు మహిళా కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.150  కూలి ఇస్తున్నా. కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది కూలీలు అవసరపడుతుంది.



 ఎకరానికి రూ.25 వేల ఖర్చు..

 లూసన్ గడ్డి సాగు చేయడానికి భూమిని సిద్ధం చేయడానికి, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.25 వేలు ఖర్చవుతుంది. గడ్డి ఏపుగా పెరగడానికి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేస్తున్నా. విత్తనాలు వేసిన రెండు నెలల తర్వాత చిన్న కొమ్మలుగా కోసి వాటిని రూ.5 కట్టలు కడుతున్నా. వాటిని మోపులుగా తయారు చేస్తున్నా. ఒక్కో మోపులో 100 వరకు కట్టలు ఉంటా యి.



 ప్రతి నిత్యం 4 మోపులను నగరానికి తరలిస్తున్నా. నగరంలోని గోశాలలు, పరిశోధన నిమిత్తం వాడే ఎలుకలు, కుందేళ్లకు మేతగా విక్రయిస్తున్నా. ప్రతిరోజు రూ.2 వేలు వస్తున్నాయి. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.800 నుంచి రూ. వెయ్యి సంపాదిస్తున్నా. లూసన్ గడ్డిని గుర్రాలు, ఆవులు, కుందేళ్లు, ప్రయోగాలకు ఉపయోగించే ఎలుకలకు మేతగా వేస్తారు. దీంతో అవి ఎక్కువ శక్తిమంతమవుతాయి. పాడి పశువులకు వేస్తే ఎక్కువ పాల దిగుబడి పెరుగుతుంది.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top