జీవోఎం సభ్యులను ఇక కలవను: కోట్ల

జీవోఎం సభ్యులను ఇక కలవను: కోట్ల

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

జీవోఎం సభ్యుల తీరును రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, ఇకపై వారు పిలిచినా వెళ్లదల్చుకోలేదని చెప్పారు. ‘‘సీమాంధ్ర కేంద్ర మంత్రులుగా మేం ఏమడిగినా తమకు సంబంధం లేదంటున్నారు. పవర్స్ లేవంటున్నారు. ఏమైనా అంటే మమ్మల్ని అవమానిస్తున్నారు. ఏం చెప్పినా వినడం లేదు’’అని కోట్ల వాపోయారు. 

 

 జీవోఎం సభ్యులుగా వారికి అసలు బాధ్యతే లేదన్నారు. రాయల తెలంగాణ ఇస్తారా? తెలంగాణ ఇస్తారా? అనేది వాళ్లే తేల్చుకుంటారని, అయితే రాయలసీమను చీల్చాలనుకోవడం మంచిది కాదన్నారు. జీవోఎం తీరు బాధాకరంగా ఉన్నా తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో,.. నేను ఓడితే ఓడిపోవచ్చు. కానీ పార్టీని వీడను’’అని చెప్పారు.  సోనియాగాంధీని అపాయింట్‌మెంట్ అడిగిన మాట నిజమేనని, పిలిస్తే ఆమెకు వాస్తవాలు చెబుతానని కోట్ల అన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్నా ఆగబోదన్నారు. 
Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top