తెలుగుదేశంతో మాకు పొత్తేంటీ?

తెలుగుదేశంతో మాకు పొత్తేంటీ? - Sakshi

  • పొత్తు కథనాలపై బీజేపీ రాష్ట్రశాఖ ఆగ్రహం

  • పనిగట్టుకుని 17 చోట్ల ఓడించారప్పుడు.. ఇవన్నీ 

  • ఓ సామాజిక వర్గం రాయిస్తున్న కథనాలని ధ్వజం

  • మోడీ అనుకూలతే తమ బలమని స్పష్టీకరణ

  • సొంతంగా ఎదుగుతామని ఉద్ఘాటన

  • బీజేపీ రాష్ట్ర ఎన్నికల బాధ్యుల కీలక సమావేశం

  •  సాక్షి, హైదరాబాద్: పొత్తు కుదిరినట్టేనంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రచారంపై బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. మునిగిపోయిన నావలాంటి టీడీపీతో పొత్తేంటని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయం దండగని, ఉచిత కరెంటు వ్యర్థమని వ్యాఖ్యలు చేయడమేగాక.. గడువుకు ముందే ఎన్నికలకుపోయి తనతోపాటు వాజ్‌పేయి ప్రభుత్వాన్నీ ముంచిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తేమిటని, ఈ రకంగా ఎందుకు ప్రచారం జరుగుతోందని వారు మండిపడ్డారు. 1999నాటి అనుభవాలను ఇంకా మరచిపోలేదన్నారు. సుపరిపాలనే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారమిక్కడ పార్టీకి చెందిన లోక్‌సభ నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్లు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, సోము వీర్రాజు, డాక్టర్ హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలు సోము వీర్రాజు, ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

     

    టీడీపీతో పొత్తు ఉండదని తమ పార్టీ నాయకత్వం పదేపదే చెబుతున్నా ఒక సామాజిక వర్గం పనిగట్టుకుని వార్తలు రాయిస్తోందని మండిపడ్డారు. పొత్తంటే రెండు పార్టీలకు లాభం ఉండాలేగానీ ఒక పక్షానికి కాదన్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తమను 17 చోట్ల ఓడించిందన్నారు. నిజంగా పొత్తుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు తెరిచి ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. బీజేపీని నిరోధించే క్రమంలోనే ఈ తరహా ఉహాగానాలు వస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఆ పరిస్థితిని సానుకూలంగా మార్చుకుని స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత సమావేశంలో అభ్యర్థుల ఎంపిక జరగలేదని వారు చెప్పారు. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల సమావేశం జరుగుతుందని తెలిపారు.

     

    కాంగ్రెస్‌ను రోజురోజుకూ క్షీణిస్తున్న పార్టీగా వారు అభివర్ణించారు. సమావేశానంతరం విజయనగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ బి.చంద్రశేఖర్ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల ఇన్‌చార్జిల భేటీకి కొందరినే ఆహ్వానించడంపై సమావేశంలో వివాదం చెలరేగింది. దీనిపై కొందరు సభ్యులు రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు. పదాధికారుల్లో కూడా కొందర్నే పిలిచారని, ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించారు. పార్టీ ఉద్యమ కమిటీల నాయకులు, అధికార ప్రతినిధులను ఎందుకు ఆహ్వానించలేదని మరికొందరు నిలదీశారు. కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. అన్ని సమావేశాలకూ అందర్నీ పిలవాల్సిన అవసరం ఉండదని, పిలిచిన మేరకు రావాల్సిన వాళ్లందరూ వచ్చారని, వ్యక్తిగత కారణాలతో కొందరు హాజరుకాలేకపోయి ఉండవచ్చని వివరించారు.

     

     24న పార్టీ కేంద్ర నాయకత్వం భేటీ..

     ఈనెల 24న ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి.. లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఆ భేటీలో ఖరారు చేస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తును పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే చేపట్టారు.
Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top