స్పీకర్ పై అవిశ్వాసం

స్పీకర్ పై అవిశ్వాసం - Sakshi


స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైఎస్సార్ సీపీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతకు కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించాలని  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ  నిర్ణయించింది. బుధవారం ఉదయం 10.30కు శాసనసభ కార్యదర్శికి అవిశాస తీర్మానం నోటీసును ఇవ్వనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిపక్షనేత, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆపార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.



స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానించారు. సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహరిస్తున్న తీరు శోచనీయంగా ఉందని, ఆయనపై గతంలోనూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. వ్యవహారశైలి మార్చుకుంటారని భావించి.. కొందరు పెద్దల సూచనతో అప్పట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నామని వివరించారు.



కానీ.. స్పీకర్ తీరులో ఏమాత్రం మార్పు కన్పించడం లేదన్నారు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చేసి, వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

 కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసును

 

పక్కదోవ పట్టించేందుకే...

వేలాది మంది మహిళల ధన, మాన, ప్రాణాలను హరిస్తూ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ సాగిస్తోన్న అరాచకాలు.. అఘాయిత్యాలను సభదృష్టికి తీసుకురావడానికి విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తే.. స్పీకర్ అడుగడుగునా అడ్డుతగిలారన్నారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అరాచకాలకు బలైన మహిళల తరఫున ఎమ్మెల్యే రోజా మాట్లాతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారన్నారు. రోజా వాగ్ధాటికి జడిసి, తమ బండారం బట్టబయలవుతుందని ఆందోళన చెంది పాలకపక్షం ఎలాంటి ఎత్తులు వేసిందో, విచక్షణ కోల్పోయి ఎలా వ్యవహరించిందో ప్రజలు చూశారన్నారు.



నిబంధనలు చదువుకోండి.. నేర్చుకోండి అని తరచూ చెప్పే శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ 340(2)ను ఉటంకిస్తూ రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌కు ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించా రు. సెక్షన్ 340(2)ను కోట్ చేస్తూ రోజాపై స్పీకర్ ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారని, అయితే స్పీకర్ ఆ సెషన్ ముగిసే వరకూ మాత్రమే ఒక సభ్యుడిని సస్పెండ్ చేయవచ్చని సెక్షన్ 340(2) స్పష్టంగా చెబుతోందన్నారు.



కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసు చర్చకు రాకుండా పక్కదోవ పట్టించేందుకే నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. ఇదే సమావేశాల్లో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదిస్తే.. స్పీకర్ రెండు రోజులపాటు సస్పెండ్ చేయడంలో ఆంతర్యమేమిటని జ్యోతుల నిలదీశారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసి మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకోవడానికే స్పీకర్ టీడీపీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.



గత అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్ష నేత 40 నిముషాల ప్రసంగానికి స్పీకర్ 17 సార్లు అవాంతరాలు కల్పించారని గుర్తు చేశారు. అధికారపక్ష సభ్యులు కోర్టులో ఉన్న అంశాలను ఉటంకిస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నా స్పీకర్ కనీసం నివారించే యత్నం కూడా చేయలేదని ఆయన అన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన రాజకీయజీవితంలో ఇలాంటి స్పీకర్‌ను ఎన్నడూ చూడ లేదన్నారు.

 

విధిలేకే అవిశ్వాసం నోటీసు

‘స్పీకర్ తీరు మార్చుకుంటారని గతంలో అవిశ్వాస తీర్మానం ఇచ్చి హెచ్చరిక చేశాం. కానీ.. స్పీకర్ శైలిలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాభ్యుదయం కోసం విధిలేని పరిస్థితుల్లోనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించాం. బుధవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ కార్యదర్శికి నోటీసు అందిస్తాం’ అని వివరించారు.



రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటుకు, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న స్పీకర్ తీరును నిరసిస్తూనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని స్పష్టీకరించారు. శాసనసభలో బలానికి.. అవిశ్వాస తీర్మానం నెగ్గడం, వీగిపోవడానికి సంబంధం లేదన్నారు. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలని కోరుకునే వారు.. ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే వారు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top