అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ - Sakshi


చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం

 సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అధికారపక్షంపైన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా సభ్యులు సోమవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విపక్ష ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, విశ్వాసరాయి కళావతి, వంతల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌డ్డి, అత్తార్ చాంద్ బాషా, అమ్జాద్ బాషా, ఐజయ్య, బుడ్డి ముత్యాల నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కంబాల జోగులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించిన టీడీపీ.. ఇప్పడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రంగా తప్పుబట్టారు. సంప్రదాయాలకు విరుద్ధంగా సభను ఎవరు నడిపిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సభలో ప్రకటన చేసే ముందు సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వడం సభ ఆచారమని, అలాంటిది ప్రతిపక్షనేతకు కూడా తెలియకుండా ప్రత్యేకహోదాపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. గట్టిగా అడిగితే అప్పటికప్పడు ఫ్యాక్స్ తెప్పించి ఓ నోట్‌ను విపక్ష నేత వైఎస్ జగన్‌కు ఇచ్చారని, అందులో ఆయన సంతకం కూడా లేదన్నారు.


మహిళలు అంటే చంద్రబాబుకు చులకన అని ధ్వజమెత్తిన విపక్ష మహిళా ఎమ్మెల్యేలు.. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు చెప్పడాన్ని మహిళలపై ఆయనకున్న చిన్నచూపునకు నిదర్శనమని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోయినా.. ప్యాకేజీతో న్యాయం జరుగుతుందంటూ.. ప్రజలను అయోమయంలోకి నెట్టివేసే విధంగా పాలకపక్షం చేస్తున్న ప్రకటనల వల్ల ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని చెప్పారు. పుష్కరాలు, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు శిక్ష పడాలన్నారు. ప్యాకేజీల కోసం ప్రజల్ని పణంగా పెట్టవద్దని, ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి కోరికని, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలోస్తాయన్నారు.

 దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..

 పుష్కరాల్లో భక్తుల చావులకు కారణమైన చంద్రబాబు శాసనసభ సాక్షిగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో మైక్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. పుష్కరాల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నారాయణ నిర్మాతగా 'బాబు బలి' అనే సినిమా తీశారని, చంద్రబాబు హీరోగా నటించారని రోజా విమర్శించారు.




 ర్యాలీగా అసెంబ్లీకి : అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి విషయంలో బాబూరావును, వనజాక్షిపై దాడి ఘటనలో చింతమనేనిని, పట్టిసీమలో కోట్లు పట్టేస్తున్న దేనినేనిని, నారాయణ కళాశాలలో ఆత్మహత్యలపై మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు వెనుకేసుకోస్తున్నారని ఆరోపించారు. టీడీపీ   సాగిస్తున్న అవినీతి, అక్రమాలపై మెడలువంచే ప్రయత్నం చేస్తామని రోజా అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top