సింగిల్‌ చపాతి చంద్రబాబుకు ప్యాంట్రీ కారా?

సింగిల్‌ చపాతి చంద్రబాబుకు ప్యాంట్రీ కారా? - Sakshi


- ఒక్క వాహనాన్ని చెక్‌చేసి మిగతావి వదిలేశారు

- ‘గాజులపల్లెమెట్ట’ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు

- నంద్యాలలో టీడీపీ వాళ్లు నోట్ల కట్టలతో రోడ్లపై తిరుగుతున్నారు

- అనుమానంతో తనిఖీ చేయమంటే ఉలుకెందుకని ప్రశ్న




నంద్యాల:
ఎన్నికల వేళ నోట్ల కట్టలతో రోడ్లపై తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. అనుమానమున్న వాహనాలను తనిఖీ చేయిస్తే టీడీపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. నంద్యాలలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘గాజులపల్లెమెట్ట’ ఘటనలో చంద్రబాబు ప్యాంట్రీ కారును మాత్రమే తనిఖీ చేసి, కారు, బస్సులను చెక్‌ చేయకుండా వదిలేశారని తెలిపారు.



తినేది సింగిల్‌ చపాతినేకదా!: ‘‘రోజుకు ఒక్క చపాతి మాత్రమే తినే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ప్యాంట్రీకారు అవసరమా?’’ అని శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా నంద్యాలవైపునకు కన్నెత్తి చూడని చంద్రబాబు.. ఎన్నికల సమయంలో మళ్లీ ప్రజల ముందుకు వచ్చి అవే మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్‌లోకి ఒక్క ముస్లింను కూడా తీసుకోని ఆయన నంద్యాలలో ముస్లింలకు ఏదో చేస్తానని అనడం హాస్యా‍స్పదంగా ఉందన్నారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తోన్న మోసాలకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, కాపులు, ముస్లింలు, మిగతావారంతా ఒక్కటై టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.



వైఎస్సార్‌సీపీ గెలుపే నిజమైన వార్త: నంద్యాలలో నోట్ల కట్టలు కుమ్మరించినా టీడీపీ గెలవలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘వీళ్ల(టీడీపీ) అక్రమాలను కళ్లారా చూసిన ఓటర్లు.. రేపు తలవంచుకుని పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తారు. చంద్రబాబుకు బుద్ధిచెబుతారు. వైఎస్సార్‌సీపీ గెలుపే ప్రపంచానికి నిజమైన వార్త అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.



పవన్‌ అభిమానులు గుర్తుంచుకోండి: ‘‘2014లో చంద్రబాబును నమ్మి పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేశారు. మూడేళ్ల తర్వాత.. చంద్రబాబు మోసాలను పవన్‌ గుర్తించారు. అందుకే రాష్ట్రాన్ని నాశనం చేస్తోన్న టీడీపీకి దూరంగా జరిగారు. పవన్‌ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top