మీ పాలన బ్రహ్మాండంగా ఉంటే ఎన్నికలకు వెళదామా?

మీ పాలన బ్రహ్మాండంగా ఉంటే  ఎన్నికలకు వెళదామా? - Sakshi


చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి సవాలు

ఏడాది పాలన వల్లే సమస్యల సుడిగుండంలో ప్రజలు


 

హైదరాబాద్: సర్వే నివేదికల ద్వారా తన ఏడాదికిపైగా పాలన బ్రహ్మాండంగా ఉం దని సీఎం చంద్రబాబు భావిస్తే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. ఏడాది 3 నెలల టీడీపీ దుర్మార్గ పాలన కారణంగా రాష్ట్ర ప్రజలంతా సమస్యలతో సతమతమవుతుంటే.. వాటి నుంచి దృష్టి మర్చలడానికే సర్వేలు, ఎమ్మెల్యేలకు ర్యాంకింగులంటూ కొత్తనాటకం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఈవేళ అతి భయంకరమైన పరిస్థితులున్నాయి. ఖరీఫ్‌కు నీళిచ్చే పరిస్థితి లేదని కృష్ణా బోర్డు స్పష్టంచేసింది. 40 ఏళ్లకాలంలో కృష్ణాడెల్టాకు నీళ్లివ్వని పరిస్థితి ఇంతకు మునుపెన్నడూ లేదు.



రైతులకు కొత్త రుణాల్లేవు. వారిపై పాత అప్పుల వడ్డీభారం రూ.పదివేల కోట్ల మేర పెరిగిపోయింది. కూలీలకు ఉపాధి హామీ పనుల్లేవు. నిత్యావసర వస్తువుల్లో కందిపప్పు కిలో రూ.140కు, శనగపప్పు రూ.100-120 దాకా పెరిగిపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రాష్ట్రం లో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. ఇంతటి దుర్మార్గ పాల నపై చంద్రబాబు సర్వే చేయించారట.



ఎమ్మెల్యేలకు ర్యాంకులిచ్చారట’ అంటూ తూర్పారపట్టారు. సర్వేలకు బదులు ఎన్నికలకు వెళితే ప్రజలే మీ పాలనపై అసలైన తీర్పు చెబుతారు కదా! అని ప్రశ్నిం చారు. ఇటీవల గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాలో వందప్రశ్నలతో ప్రజాబ్యాలెట్ విడుదల చేశామని, అందులో చంద్రబాబు ఇచ్చిన హామీలపై అడిగిన వంద ప్రశ్నల్లో ఒక్కదానికి ఒక్క మార్కు పడుతుందేమో చూసుకోండని సలహా ఇచ్చారు.



ఏడాదిలో ఎన్ని విదేశీ పర్యటనలో..

మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపెంగనూనె అన్నచందంగా చంద్రబాబు అధికారంలోకొచ్చిన ఏడాది మూడు నెలలకాలంలో వరసపెట్టి విదేశీ పర్యటనలకు వెళుతున్నారని అంబటి దుయ్యబట్టారు. ఎన్ని విదేశీ పర్యటనలకెళ్లారు.. ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలన్నారు. ఎన్నికలముందు ఊరూరా బీజేపీ నేతల్ని పక్కన పెట్టుకుని ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకహోదాపై ఒక్కమాటా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబును నిందితునిగా స్టీఫెన్‌సన్ సాక్ష్యం చెప్పడం.. గోదావరి పుష్కరాల్లో సీఎం కారణంగా తొక్కిసలాట జరిగి 30మంది చనిపోయిన ఘటనలపై కేంద్రం విచారణ జరిపిస్తుందని భయపడే ఆయన నోరు మెదపట్లేదేమోనన్నారు.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top