వైఎస్ ఉంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది

వైఎస్ ఉంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది - Sakshi


♦ కరీంనగర్ జిల్లా పరామర్శయాత్రలో షర్మిల

♦ ఏ ఒక్క చార్జీ పెంచకుండానే అద్భుతంగా పాలించిన గొప్ప నేత

♦ ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి

♦ చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపు

♦ రాజన్న బిడ్డను చూసేందుకు బారులు తీరిన జనం

 

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పేదప్రజల పెన్నిధి  వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండుంటే రాష్ట్రం లోని ప్రతీ ఇల్లు కళకళలాడేదని... రైతులంతా సంతోషంగా ఉండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆయన మరణించి ఆరేళ్లయినా కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువై ఉన్నాడని చెప్పారు. వైఎస్సార్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర... శుక్రవారం కరీంనగర్ జిల్లాలో రెండో విడత కొనసాగింది. శుక్రవారం హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు.



ఈ సందర్భంగా జమ్మికుంట, కరీంనగర్ పట్టణాల్లో షర్మిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ద భారీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కుమార్ తదితరులతో కలసి షర్మిల ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు షర్మిల మాటల్లోనే..



 ‘‘ఒక నాయకుడు చనిపోతే దానిని జీర్ణించుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవు. ఒక్క రాజశేఖరరెడ్డి విషయంలోనే అది జరిగింది. ఎందుకంటే.. ఆయన ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టాడు. ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, రైతులకు పూర్తి రుణ మాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేసి రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలకు భరోసా కల్పించాడు. ఏ చార్జీ పెంచినా, ఏ పన్ను పెంచినా ఆ భారం మహిళలపై పడుతుందనే ఉద్దేశంతో ఐదేళ్ల పాలనలో కరెంటు, గ్యాస్, ఆర్టీసీ సహా ఏ చార్జీలను పెంచలేదు.



ఆయన బతికుంటే ప్రతి పేదవాడి ఇల్లు కళకళలాడేది. రైతులంతా సంతోషంగా ఉండేవారు. ప్రతి ఇంటికీ నీరుండేది. ఉచిత విద్య అందేది. మనిషిని మనిషిలా గౌరవించిన మహనీయుడు ఆయన. ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం మీరు, మేము చేయి, చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం..’’ అని షర్మిల పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంద రాజేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలోనూ షర్మిల మాట్లాడారు.



 వైఎస్‌నే గుర్తుచేస్తున్నారు: పొంగులేటి

 పరామర్శయాత్రలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలననే గుర్తుచేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ పాలనలోనే తామంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో షర్మిల యాత్ర చేశామని, కొద్దిరోజుల్లోనే మిగతా జిల్లాల్లోనూ పరామర్శ యాత్ర చేపడతామని చెప్పారు.



ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, షర్మిల సంపత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కె.నగేష్, సెగ్గెం రాజేష్, నగర అధ్యక్షుడు సిరి రవి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిర, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి సందమల్ల నరేష్, సొల్లు అజయ్‌వర్మ, మంద రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top