‘హోదా’ కోసం 26 నుంచి జగన్ దీక్ష

‘హోదా’ కోసం 26 నుంచి జగన్ దీక్ష - Sakshi


రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గుంటూరు వేదికగా పోరాటం

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీక్షను ఈ నెల 15వ తేదీ నుంచే చేపట్టాలని తొలుత భావించినప్పటికీ వినాయక చవితి, నిమజ్జనంతో పాటుగా బక్రీద్ పండుగ కూడా ఉండటంతో 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు. గుంటూరు పట్టణంలో ప్రారంభమయ్యే ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు.



కింది స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినపుడే బలోపేతం అవుతుందన్నారు. ఇప్పటికే చాలా వరకూ మండలాల్లో కమిటీలు పూర్తయ్యాయని సమావేశంలో నేతలు వెల్లడించారు. మిగతా మండలాల్లో కూడా ఆలస్యం చేయకుండా నియామకాలు జరగాలని జగన్ అన్నారు. ఈ సమావేశంలో ఎంవీ మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, జ్యోతు ల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అనంత వెంకట్రామిరెడ్డి, కొడాలి నాని, పి.మిథున్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సుజయ్ కృష్ణరంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి, రెడ్డి శాంతితో పాటుగా పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.

 దీక్ష పోస్టర్ విడుదల...: 26 నుంచి జగన్ చేయతలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు. హక్కుగా సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి తీసుకు రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ నేతలు తమ స్వలాభాల కోసం నీరుగార్చుతున్నారని గ్రహించే జగన్ ఈ దీక్షకు పూనుకుంటున్నారని వివరించారు. ప్రత్యేక హోదా పొందిన అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరిగాయని, వాటి ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.



విభజన వల్ల దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేకహోదా ఒక్కటే పరిష్కారం అని వైఎస్సార్‌సీపీ గట్టిగా విశ్వసిస్తోందన్నారు. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కానే కాదని హోదా శాశ్వ తం, ప్యాకేజీ తాత్కాలికమన్నారు. రాష్ట్రం లోని ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షతో ఉన్నారని వారి తరఫున జగన్ పోరాటానికి సిద్ధమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబా బు, కొత్తపల్లి సుబ్బారాయుడు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, పి.గౌతంరెడ్డి, కత్తెర క్రిస్టినా పాల్గొన్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top