ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్

ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్ - Sakshi


హైదరాబాద్ :  తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో  ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టి నినాదంతో దాదాపు ప్రతి రాష్ట్రానికీ వెళ్లామని అన్నారు.



ఆర్టికల్ 3 పై వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిశామని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరామన్నారు. ఆర్టికల్ 3ని మార్చేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా చెప్పామన్నారు. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని జగన్ తెలిపారు. పార్లమెంటులో కొన్ని పార్టీలచేత వాయిదా తీర్మానాలుకూడా ఇప్పించామని చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంమీద ఇతరరాష్ట్రాలతో మాట్లాడించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దేశంమొత్తం గమనించేలా చూడగలిగామని జగన్ చెప్పారు. కాని రాష్ట్రంలోని పరిణామాలు బాధకలిగిస్తున్నాయని జగన్ ఆవేధన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పామన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ, తర్వాత జీవోయమ్, తర్వాత డ్రాఫ్టు బిల్లు, దాన్ని రాష్ట్రపతి పంపించడం జరిగిందని, కీలకమైన పరిణామాలన్నీ జరిగాయని తెలిపారు. మన కాళ్లకింద నీళ్లు వచ్చినప్పుడు.. కిరణ్‌ మోసం చేసేలా మాట్లాడారని చెప్పారు. తర్వాత ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారని  అన్నారు. ఇప్పుడు నీళ్లు పీకలదాకా వచ్చాయని జగన్ తెలిపారు. ఇవాళ కూడా 371(డి) పేరిట మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గురువారం రాత్రి స్పెషల్‌ ఫ్లైట్‌లో డ్రాఫ్టు బిల్లు వచ్చిందని, 17 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన అందరి అధికారులకూ పంపారన్నారు.



ఈ బిల్లును అసెంబ్లీకికూడా కిరణ్‌కుమార్‌ పంపించారని ఆయన తెలిపారు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు.. మేలుకోండని కిరణ్‌కు చెప్తున్నా అని జగన్ అన్నారు. విభజనకు కిరణ్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, చంద్రబాబునాయుడిని చూస్తే మరింత బాధ కలుగుతుందని చెప్పారు. టీడీపికి ఆరుగురు ఎంపీలు ఉంటే.. నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంలో సంతకాలు చేశారని, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కనిపించడమే లేదని జగన్ అన్నారు. దేశం మొత్తం చూస్తుండగానే టీడీపీ ఎంపీల్లో 4 ఎంపీలు ఒకవైపు, ఇద్దరు మరోవైపు ఉన్నారన్నారు. వారంరోజులుగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెడుతున్నా... ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే అనలేదని జగన్ విమర్శించారు. ఇవాళ దేశం మొత్తం చూస్తోందని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ విజ్క్షప్తి చేశారు. సమైక్యానికి తీర్మానంచేయాలంటూ అంతా పట్టుబట్టాలిని, అంతేకాక ఓటింగ్‌ జరిపించి సమైక్య తీర్మానం చేసి... అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జగన్ కోరారు. దీనిపై జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరే ఈ పనిచేయలేరని, జగన్మోహన్‌రెడ్డికి మీ మద్దతు కావాలని కోరారు. చంద్రబాబు, కిరణ్‌లు ఇద్దరూ చరిత్ర పుటల్లో హీనులుగా మిగిలిపోతారని జగన్ దుయ్యబట్టారు. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని కోరారు.



ఒక్కసారి విభజిస్తే.. తొమ్మిదో స్థానంకోసం ఒక రాష్ట్రం, 14వ స్థానంకోసం మరో రాష్ట్రం పోటీపడుతుందని జగన్ అన్నారు. విభజిస్తే మహానగరం, ఒకవైపు, సముద్రం మరోవైపు ఉంటుందని, అఖరికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ హెచ్చరించారు. విభజన ఆగేవరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు.  ఒకసారి విభజన మొదలయితే మళ్లీ అదే డిమాండ్ తలెత్తుందన్నారు. భవిష్యత్తులో అన్నిప్రాంతాలకు ఇదే పొంచి ఉందని జగన్ హెచ్చరించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనను సమర్ధిస్తున్నారని తెలిపారు.  విభజనను వ్యతిరేకిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించే వారికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.



అలాంటి చంద్రబాబు నిందలు వేయడానికి సిగ్గుండాలన్నారు. తమ వైపు వేలు చూపించే బదులు.. ఇప్పటికైనా సమైక్యం కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటలేదంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి నిందలు వేసేముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పారు. చంద్రబాబు కుప్పం వెళ్తే అక్కడి రైతులు, విద్యార్థులు చొక్కా పట్టుకుని నిలదీస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబును అడుగుతున్నాం... సమైక్యానికి లేఖ ఇమ్మని కోరుతున్నామన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. అలాంటి వారికే ప్రధానిగా మద్దతు ఇస్తామని లక్షలమంది సమక్షంలో తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సీఎం కిరణ్ ఏం చెప్పినా శాసనసభ్యులు సమైక్యభావం వీడొద్దన్నారు.  ఇప్పుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల వచ్చేది ఏమి ఉండదన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top