'రైతుల వద్దకు చంద్రబాబు రాకపోవడం దారుణం'

'రైతుల వద్దకు చంద్రబాబు రాకపోవడం దారుణం' - Sakshi


కాకినాడ : భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు.  అనంతరం వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ... జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టపోతే... కేవలం 18 వేల ఎకరాలే పంట నష్టం జరిగినట్లు అధికారులు చూపుతున్నారని విమర్శించారు.



చాలా చోట్ల నష్టపోయిన రైతుల వద్దకు అధికారులు వెల్లడంలేదని మండిపడ్డారు. గత తుపానులో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు... రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ అలా జరగడం లేదన్నారు. ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ప్రశ్నించారు.



అప్పులు చేసి మరీ పంటలు వేశామని రైతులు వైఎస్ జగన్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. దాంతో అన్ని విధాల అండగా ఉంటామంటూ రైతులకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కొత్తపేట మండల బాలయోగిపేటలో వైఎస్ జగన్ పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మీద పెట్టే దృష్టి రైతులపై చూపితే బాగుంటుందని అన్నారు. తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జల్లాల్లో ఇప్పటికే పర్యటించి... వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top