Alexa
YSR
‘ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్లాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

పరిపాలనకు బాబు యోగ్యుడేనా?

Sakshi | Updated: January 11, 2017 07:05 (IST)

మూడేళ్లలో ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు: వైఎస్‌ జగన్‌

ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను అత్తగారి సొత్తులా లాక్కుంటున్నారు
కరువు మండలాలను పేరుకు ప్రకటిస్తున్నా మేలు సున్నా
ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఏదీ?
మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టించలేదు
ఆరోగ్యశ్రీ, ఫీజుల పథకాలు నిర్వీర్యం
వైఎస్‌ స్వప్నం బజారున పడే పరిస్థితి దాపురించింది
కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’  తొలి విడత ముగింపు

ys jagan


రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు:‘‘రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన లెక్కలేనన్ని హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వ లేదు. పేదలకు ఒక్క ఎకరా భూమినైనా పంచలేదు. పైగా ఎస్సీ, ఎస్టీల భూములు ఆయన అత్తగారి సొత్తు అయినట్టు లాగేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు యోగ్యుడేనా?’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి, ధైర్యం చెప్పేందుకు జగన్‌ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ కర్నూలు జిల్లా  శ్రీశైలం నియోజకవర్గంలో మంగళ వారం ఆరో రోజు కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయన వెంగళరెడ్డి పేట నుంచి బయలుదేరి బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదుగా మహానందికి చేరుకున్నారు. మహానందిలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం గాజులపల్లెకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో భారీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత ‘రైతు భరోసా యాత్ర’ మంగళవారం ముగిసింది. చివరి రోజు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. గాజులపల్లె బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

చంద్రబాబుతో పాటు వచ్చింది కరువే
‘‘ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనను చూసిన తర్వాత... అయ్యో ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మాకు దూరమయ్యిందే, ఆ పాలన మాకు కరువయ్యిందే అని జనం అనుకుం టున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జాడేలేదు. ఈ మూడేళ్లు చంద్రబాబుతో పాటు రాష్ట్రానికి వచ్చింది కరువు మాత్రమే. శ్రీశైలం డ్యామ్‌ నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వాలంటే 844 అడుగులకు పైన నీళ్లు ఉండాలి. 844 అడుగులపైన ఆగస్టు 16వ తేదీ నుంచి ఉన్నాయి. అయినా ఇప్పటిదాకా సాగునీరు ఇవ్వలేకపోయారు. మనకు తెలుగుగంగకు రబీ పంటకు నీరు ఇవ్వబోమని చెబుతున్నారు. ఆ రోజు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతీ సంవత్సరమూ రబీకి నీళ్లు అందాయి. ఇప్పుడు వరుసగా మూడేళ్లపాటు రబీకి నీళ్లు ఇవ్వబోమని పాలకులు సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి.  

కేబినెట్‌ భేటీల్లో దుర్మార్గపు ఆలోచనలు
మంత్రివర్గ సమావేశాల్లో రైతుల కష్టాలపై చర్చించరు. పేదవాడికి జరగాల్సిన మేలు గురించి మాట్లాడరు. రైతుల భూములను ఎలా లాక్కోవాలి? లాక్కున్న భూములను పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు, సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చి కమీషన్లు ఎలా కొల్లగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనలను కేబినెట్‌ భేటీల్లో చేస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో 23 లక్షల మంది పేదలకు అక్షరాలా 31.25 లక్షల ఎకరాలను పంచిపెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎస్సీ, ఎస్టీల భూములను తన అత్తగారి సొత్తులా భావిస్తున్నారు. పేదల భూములు, అసైన్డ్‌ భూములు కనిపిస్తే చాలు వాటిని ఎలా లాక్కోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 31.25 లక్షల ఎకరాలను పేదలకు పంచగా, చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో ఒక్క ఎకరా కూడా ఇచ్చిన పాపానపోలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, వైఎస్సార్‌ హయాంలో కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీపడ్డారు. చంద్రబాబు మాత్రం మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు.

కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. ఇప్పుడేది?
చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితిని గమనిస్తే మరింత బాధేస్తోంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘108’ నంబర్‌కు ఫోన్‌ కొడితే చాలు కుయ్‌... కుయ్‌... కుయ్‌.. అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ ఇంటికొచ్చేది. ఇప్పుడు అంబులెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. వైఎస్సార్‌ హయాంలో మూగ, చెవుడుతో బాధపడుతున్న చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేదాకా రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చయ్యే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీని ఉచితంగా చేసేవారు. ఇవాళ మూగ, చెవుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయం అంటూ వెనక్కి పంపిస్తున్నారు.

మూత్రపిండాలు ఫెయిలైన రోగులదీ, కేన్సర్‌ రోగులదీ అదే పరిస్థితి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వప్నం బజారున పడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో అన్నాడా? లేదా? రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడా? లేదా? డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా? లేదా? (అన్నాడని ప్రజలంతా బిగ్గరగా బదులిచ్చారు) హామీల అమలు కోసం ప్రజలంతా చంద్రబాబును గట్టిగా నిలదీయాలి. అప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమోనని ఆశిద్దాం.  

బాబు పచ్చి అబద్ధాలకోరు
చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, తానే చేశానని అంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ముచ్చుమర్రి ప్రాజెక్టును చూశాం. వైఎస్‌ హయాంలోనే 90 శాతం పూర్తయ్యింది. మూడేళ్ల నుంచి మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తన కలలోకి వచ్చిందని, దాని కోసం చాలా కష్టపడ్డానని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి పాలనకు యోగ్యుడేనా అని అడుగుతున్నా. చంద్రబాబు రేపు పులివెందులకు వెళుతున్నారు. రూ.700 కోట్ల పైడిపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. చంద్రబాబు తన మనఃసాక్షిని ప్రశ్నించుకోవాలి.

అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చింది? ఈ ప్రాజెక్టును ప్రారంభించింది, పనులు చేసింది దివంగత నేత వైఎస్సార్‌ హయాంలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్లి పైడిపాలెం కూడా తన కలలోకి వచ్చిందని చంద్రబాబు చెబుతారేమో! ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. అందరూ అడుగులో అడుగు వేసి, చేతిలో చేయి వేసి నాతోపాటు కలిసి నడవాలని కోరుతున్నా’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో రెండోవిడత రైతు భరోసా యాత్ర ఈ నెల 19 నుంచి  ప్రారంభమవనుంది.

Ys jagan

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి సన్నిధిలో వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అలాగే శ్రీ కోదండరాముల వారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు  వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు.             
                      – మహానంది
వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

చిట్టితల్లీ క్షేమమేనా?

Sakshi Post

Person Caught With Rs 7 Crore ‘Demon’ Notes Is Brother Of Actress Jeevitha Rajasekhar

The person, Srinivas, who was caught with demonetised currency notes of Rs 7 crore on Thursday has t ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC