పాత్రధారి కేఈ.. సూత్రధారి చంద్రబాబు




- టీడీపీకి మనుగడ ఉండదనే నారాయణరెడ్డిని హత్య చేశారు

- బాబు జైల్లోపడితేగానీ వ్యవస్థ మారదు: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

- వైఎస్సార్‌సీపీ నాయకులపై అధికార టీడీపీ రాక్షసకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు




హైదరాబాద్‌:
విపక్ష నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ, మాట వినకుంటే ప్రాణాలు తోడేస్తూ అధికార తెలుగుదేశం రాక్షస పరిపాలన సాగిస్తున్నదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌.. ఏపీలో జరుగుతోన్న రాక్షసకాండపై ఫిర్యాదుచేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు.



‘నారాయణరెడ్డి హత్యతో ఏపీలో మరోసారి ప్రజాస్వామ్యం హత్యకుగురైంది. పక్కపార్టీ నాయకులను కొనుగోలుచేయడం, ప్రలోభాలకు లొంగకపోతే ప్రాణాలు తీయడం తెలుగుదేశం పార్టీ విధానంగా మారింది. మరోవైపు వివిధ కేసుల్లో దోషులు, నిందితులుగా ఉన్న సొంత పార్టీ వారిని కేసుల నంచి తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 132 జీవోలు జారీచేసింది.



నారాయణరెడ్డి బతికుంటే టీడీపీకి మనుగడ ఉండదనే హత్యచేశారు. ఉద్దేశపూర్వకంగా గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయలేదు. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కొడుకు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించేదాకా నారాయణరెడ్డి పోరాడారు. అందుకే ఆయను అడ్డుతప్పించారు. ఈ హత్యను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.



పోలీసులు ఆలస్యంగా వచ్చింది అందుకే..

కేఈ కుటుంబం ఇసుక దందాపై పోరాటం నేపథ్యంలో తన ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని నారాయణరెడ్డి పలుమార్లు పోలీసులను అభ్యర్థించారని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. సెక్యూరిటీ కల్పించకపోగా, లెసెన్స్‌ రెన్యూవల్‌ పేరుతో ఉన్న ఆయుధాన్ని కూడా తీసేసుకుకోవడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. నారాయణరెడ్డి ఓ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా, ఆయన భార్య కర్నూలు డీసీసీబీ చైర్‌పర్సన్‌గా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నా రక్షణ కల్పించకపోవడం దారుణమని జగన్‌ అన్నారు.



నారాయణరెడ్డి హత్య తరువాత హంతకులను పట్టుకునే విషయంలో కూడా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఉదయం 9:30కు హత్య జరిగితే, మధ్యాహ్నం 2:30 దాకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, తద్వారా సాక్ష్యాధారాలు చెదిరిపోవాలన్న దురుద్దేశంతోనే పోలీసులు అలా వ్యవహరించారని వైఎస్‌ జగన్‌ అన్నారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో టీడీపీ దారుణాలకు బలైపోయిన వైఎస్సార్‌సీపీ నేతల జాబితాను గవర్నర్‌కు అందించామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారు.


గవర్నర్‌ నరసింహన్‌కు వైఎస్‌ జగన్ సమర్పించిన లేఖ ఇదే...

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top