సీఎం ఆకాశంలో చక్కర్లు కొడితే... రైతుల కష్టాలు తెలుస్తాయా?

సీఎం ఆకాశంలో చక్కర్లు కొడితే... రైతుల కష్టాలు తెలుస్తాయా? - Sakshi


బాబూ నేల మీదకు దిగండి: వైఎస్ జగన్

- ఇప్పటివరకు బాధిత రైతుల ముఖం చూసిన నాథుడే లేడు

- సీఎం పుణ్యమా అని.. బ్యాంకుల్లో రుణాలు పుట్టలేదు

- ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షనేత డిమాండ్

- గుంటూరు జిల్లాలో బాధిత రైతులకు జగన్ పరామర్శ..

 

 సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో:
‘అయ్యా ముఖ్యమంత్రిగారూ.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్లలో తిరిగితే ఏం అర్థమౌతుంది. నేల మీదకు రండి. రైతుల కష్టాలను చూడండి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి.’అని సీఎం చంద్రబాబుుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. చేతికి అందుతుందనుకున్న పంట అకాలవర్షాల ధాటికి దెబ్బతిన్నదని, పత్తి, మిరప చేలల్లో నాలుగైదు రోజులుగా నీళ్లు నిలిచిపోవడంతో మొక్కల వేళ్లు కుళ్లిపోయి పంట మొత్తం పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధతో రైతులు తల్లడిల్లిపోతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ముఖం చాటేసిందని, చంద్రబాబు ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘గత ఏడాది రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా రైతుకు ఇవ్వలేదు.



రుణాలు మాఫీ కాక, బ్యాంకుల్లో రుణాలు పుట్టక, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేస్తే.. ఈ సంవత్సరం చేలో వేసిన పంట చేలోనే పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పట్టించుకోవడం లేదు. రైతులు ఎలా బతకాలి..?’’ అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, మాచర్ల నియోజకవర్గాల్లో వర్షాలు, వరదల బీభత్సానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు రెండు రోజుల పర్యటన కోసం జగన్ సోమవారం గుంటూరు జిల్లాకు వచ్చారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పొలాలను ఆయన పరిశీలించారు.

బాధిత రైతులను పరామర్శించారు. ఆయనేమన్నారంటే..



 2 లక్షల ఎకరాల్లో పంటనష్టం..

 ‘‘పత్తి, మిరప సాగు చేయాలంటే.. ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేలు పెట్టుబడి కావాలి. కౌలు రైతులైతే ఎకరాకు అదనంగా రూ. 15 వేలు కట్టాలి. మూడున్నర లక్షల ఎకరాల్లో పత్తి, ఒకటిన్నర లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు. అందులో రెండు లక్షల ఎకరాల్లో పంట దారుణంగా నష్టం జరిగింది. ఇంత పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట నష్టపోయి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. రైతులు అంతులేని ఆవేదనలోఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాశం నుంచి కనీసం కిందకు దిగలేదు. ఆకాశంలో తిరుగుతూ ఆయనంతట ఆయనే.. నష్టం లెక్కించి, ముష్టి వేసినట్లు రూ. 10 కోట్లు సాయం ప్రకటించారు. అది కూడా రైతులకు కాకుండా.. డ్రెయినేజీ వ్యవస్థ మరమ్మతులకు ఇచ్చారట. ముఖ్యమంత్రి ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోతున్నారు. కనీసం క్షేత్రస్థాయి పరిశీలనా చేయలేదు. ఇప్పటికైనా నేల మీదకు వచ్చి రైతుల కష్టాలను చూడాలి. జూలై ఆఖరు నుంచి ఆగస్టు నెలాఖరు వరకు వర్షాలు పడలేదు. సబ్సిడీ రైతులు పంటలను ఏదో విధంగా కాపాడుకుంటే.. సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో ఒక విడత, ఇప్పుడు రెండో విడత వర్షాలు పంటలను దెబ్బతీశాయి. పంట నుంచి ఒక్క పైసా రైతుకు తిరిగి రాలేదు.



 ఒక్క రూపాయి రాలేదు: గత ఏడాదికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా గుంటూరు జిల్లాకు అందలేదు. ఈ జిల్లాకు దాదాపు రూ. 120 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రావాలి. గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీ రైతుకు అందలేదు. ఈ సంవత్సరం పంటల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. బ్యాంకులకు వెళితే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు ఈ రోజు లేకుండా పోయాయి. రైతుల రుణాలు మాఫీ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్న రుణాలకు వడ్డీల మీద వడ్డీలు వేయడంతో రైతుల నడ్డి విరిగిపోయింది. బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి కాస్తోకూస్తో తక్కువ వడ్డీకి రుణం తీసుకుందామనుకుంటే.. ఆ అవకాశమూ రైతులకు లేకుండా పోయింది.



బంగారం పెట్టుకొని రైతులకు రుణాలు ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఫలితంగా.. బ్యాంకులకు వెళ్లినా రైతులకు రుణాలు పుట్టడం లేదు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేయలేదు కాబట్టి రుణాలు రెన్యువల్ కాలేదు. పావలా వడ్డీ, సున్నా వడ్డీకి రుణాలు అందే పరిస్థితి లేకపోవడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ. 2-3 వడ్డీకి రుణాలు తెచ్చుకొని పంటలు వేయాల్సిన దుస్థితి వచ్చింది. భారమైనా.. భవిష్యత్ మీద ఆశతో భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే.. పంటల పరిస్థితి ఈ మాదిరిగా ఉంది.



 మీనమేషాలు తగదు: రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1,000 కోట్లు రావాలి. అందులో గుంటూరు జిల్లాకు రూ. 120 కోట్లు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాదే ఒక్క పైసా రైతుకు ఇవ్వలేదు. ఈ ఏడాది రైతులు వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయి అల్లాడిపోతున్నారు. నాలుగైదు రోజులు పంట చేలల్లో నీళ్లు నిలబడిపోవడం మూలంగా వేళ్లు కుళ్లిపోయి పంట మొత్తం దెబ్బతిని పోయిందనే విషయం ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా నిలస్తుందని హామీ ఇస్తున్నాం.’’ అని జగన్ పేర్కొన్నారు. కాగా, రైతులు దారుణంగా నష్టపోతే.. ప్రభుత్వం పక్షాన మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, కనీసం ఒక్క అధికారి కూడా తమ ముఖం చూడలేదని ముత్యాలంపాడు రైతులు  జగన్‌కు  ఫిర్యాదు చేశారు.  ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు రావాల్సిన సహాయాన్ని ఇప్పిస్తామని విపక్ష నేత హామీ ఇచ్చారు. కాగా, తమ పార్టీ అధికారంలోకి రాగానే బుడగజంగాలకు ఎస్సీల్లో చేరుస్తామని జగన్ ప్రకటించారు.



 ఉదయం 11 నుంచి అర్ధరాత్రి 12 వరకు..  గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి12 గంటల వరకు జనం మధ్యే  నిర్విరామంగా తిరిగారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top