అమెరికాలో మరో విద్వేషం

అమెరికాలో మరో విద్వేషం - Sakshi


న్యూయార్క్‌: అమెరికాలో జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సబ్‌వే రైలులో ప్రయాణిస్తున్న ఓ సిక్కు మహిళను శ్వేతజాతీయుడు దూషించిన ఘటన వెలుగుచూసింది. ఆమెను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళగా భావించి ‘ఈ దేశానికి చెందిన వ్యక్తివి కావు. లెబనాన్‌కి తిరిగి వెళ్లిపో..’ అంటూ ఆ దుండగుడు తీవ్రంగా దూషించాడు. ఈ ఘటనను న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించే ‘దిస్‌ వీక్‌ ఇన్‌ హేట్‌’లో ఆమె వివరించింది.


స్నేహితురాలి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు రాజ్‌ప్రీత్‌ హైర్‌ అనే మహిళ మన్‌హట్టన్‌ వైపు వెళ్లే సబ్‌వే రైలు ఎక్కింది. ఆ సమయంలో రైలులోని ఓ శ్వేతజాతీయుడు ఆమెను దేశం విడిచి వెళ్లాలంటూ పెద్దగా కేకలు వేశాడు. పరుష పదజాలంతో తీవ్రంగా దూషించాడు. కాగా, తాను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళను కాదని, ఇండియానాలోని ఓ నగరంలో జన్మించినట్లు పేర్కొంది. అయితే ఆ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఆ దుండగుడు తనను దూషించి ఉండవచ్చని ఆమె పేర్కొంది. అనంతరం ఇద్దరు మహిళలు తనకు ధైర్యం చెప్పారని, మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొంది.



ఇది మా దేశం... ఇక్కడే ఉంటాం

వాషింగ్టన్‌: అమెరికాలో జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా ఇండో–అమెరికన్లు గళమెత్తారు. ‘ఇది మా దేశం. ఇక్కడ నివసించడానికే వచ్చాం. ఈ దేశంలో మా న్యాయ, సమాన హక్కులను డిమాండ్‌ చేస్తూనే ఉంటాం’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ టౌన్‌హాల్‌ సమావేశంలో దక్షిణాసియా అమెరికన్‌ లీడింగ్‌ టుగెదర్‌(సాల్ట్‌) ప్రతినిధి సుమన్‌ రఘునాథన్‌ అన్నారు. ఇటీవల పెరిగిన విద్వేష దాడులకు వ్యతిరేకంగా యూదులు, ముస్లింలు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఇండో అమెరికన్‌లు పాల్గొన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల్లో శాంతి నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top