'టీచర్లు అంటే మాకెంతో గౌరవం... చంపం'

కిడ్నాపర్ల చెరలో ఉన్న గోపీకృష్ణ, బలరాం


బెంగళూరు: లిబియాలో ఇద్దరు తెలుగు వారితో సహా నలుగురిని కిడ్నాప్  చేసింది ఐఎస్ఎస్ ఉగ్రవాదులేనని నిర్ధారయింది. అపహరణకు గురైన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్(56) తెలిపారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన విజయ కుమార్ సిర్త్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.



తమను చీకటి గదిలో బంధించారని తెలిపారు. కిడ్నాపర్లు తమ పేర్లు, మతం, ఉద్యోగాల గురించి అడిగారని చెప్పారు. తాము యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నామని చెప్పగానే తమ పట్ల వారి వైఖరిలో సానుకూల మార్పు కనబడిందని వివరించారు. కిడ్నాపర్ల నాయకుడు తన పేరు షేక్ గా పరిచయం చేస్తున్నాడని తెలిపారు. ఎవరికో ఫోన్ చేసి అరబిక్ మాట్లాడారని, తర్వాత అతడి వైఖరితో మార్పు వచ్చిందన్నారు. 'టీచర్లు అంటే మాకెంతో గౌరవం. మీ కారణంగానే లిబియాలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. మీకు ఎటువంటి హాని తలపెట్టం' అని షేక్ తమతో చెప్పాడని వెల్లడించారు. 



సిర్త్‌యూనివర్సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తమను నలుగురు దుండగులు తమను కిడ్నాప్ చేశారని లక్ష్మీకాంత్ చెప్పారు. తర్వాత తమను పెద్ద గోడ ఉన్న పెద్ద హాల్ లోకి తీసుకెళ్లి తమదగ్గరున్న డబ్బు, వస్తువులు తీసుకున్నారని తెలిపారు.



'లిబియాను ఎందుకు విడిచి వెళుతున్నారు, ఇస్లాం గురించి మీకేం తెలుసో చెప్పాలని షేక్ తమను ప్రశ్నించాడు. ఆరు నెలల వయసున్న నా కుమార్తెను చూసేందుకు వెళ్లాలని నన్ను విడిచి పెట్టాలని కోరాను. ఇస్లాం గురించి వివరించాను. ఇండియాలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా కలిసివుంటున్నారని, మతసామర్యంతో పండుగలు జరుపుకుంటున్నారని తెలిపాను. ఆ రాత్రి మాకు ఆహారం పెట్టలేదు' అని లక్ష్మీకాంత్ తెలిపారు. వీరిద్దరినీ  శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top