కబేళాలు క్లోజ్‌.. పొగాకు ఉత్పత్తులు బంద్‌..

కబేళాలు క్లోజ్‌.. పొగాకు ఉత్పత్తులు బంద్‌.. - Sakshi


షీ-టీమ్స్‌ తరహాలో యాంటీ రోమియో బృందాల ఏర్పాటు

మంత్రులకు శాఖల కేటాయింపు

మూడో రోజే సీఎం యోగి సంచలన నిర్ణయాలు

మీరట్‌లో మాంసం దుకాణాలకు నిప్పు




లక్నో:  

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యరంగంలోకి దిగారు. బుధవారం కేబినెట్‌ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలు వెలువరించారు. హోం, ఆర్థికశాఖలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ వర్మ పీడబ్ల్యూడీ, విద్యాశాఖలను కేటాయించారు. మిగతా కేబినెట్‌ సభ్యులకు శాఖలు కేటాయించారు. ఇది ఉంటే, జంతువధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పోలీసు అధికారులను  ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధిస్తూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. అన్ని అక్రమ కబేళాలను మూయించి వేస్తామని, యంత్రాలతో నడిచే కబేళాలపై పూర్తి నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మీరట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మూడు మాంసం దుకాణాలకు నిప్పుపెట్టారు. మాన్యవర్‌ కాన్షీరాం కాలనీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో మీరట్‌వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  



వేధిస్తే తాటతీస్తారు

మహిళల భద్రత కోసం యాంటీ–రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు యోగి ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో మహిళలను వేధిస్తూ కనిపించిన పలువురిని ఈ బృందాలు అరెస్టు చేశాయి. పాఠశాలలు  కళాశాలలు, దుకాణాల దగ్గర పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈవ్‌టీజర్లను గూండా చట్టం కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు.



పొగాకు ఉత్పత్తులు బంద్‌

విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్‌ మసాలా, గుట్కా, సిగరెట్‌ వంటి పొగాకు ఉత్పత్తులను యూపీ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగులు, సిబ్బంది ఇలాంటి వాటిని ఉపయోగించొద్దని, పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. పాత సచివాలయంలోని ఒక భవనం గోడలపై పాన్‌ మరకలు ఉండటాన్ని చూసి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  



ట్వీట్‌కు తక్షణం స్పందించిన యోగి

హోలీ రోజు ఒకరి ఇంట్లోకి చొరబడిన కొందరు యువకులు యజమాని భార్య, కూతురిని వేధించారు. ఈ విషయమై బాధితుడు కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్‌వాసి ట్వీట్‌ చేయడంతో సీఎం యోగి తక్షణం స్పందించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ముఖ్యమంత్రిని ఆశ్రయించానని ఆయన మీడియాకు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని వైద్యపరీక్షలకు పంపించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెడతామని పోలీసులు తెలిపారు.



సీఎం అభ్యంతరకర ఫొటోల పోస్టింగ్‌: మహిళపై కేసు

బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభ్యంతరకర ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ప్రభ బైళహోంగల అనే కర్ణాటక మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ యువమోర్చా ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసు అదనపు కమిషనర్‌ (క్రైమ్‌) ఎస్‌.రవి తెలిపారు. మహిళతో ఆదిత్యనాథ్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలను (మార్ఫింగ్‌) ప్రభ తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు.



ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు

 శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తనవద్దే ఉంచుకున్నారు. మొత్తం 44 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు ప్రజా పనుల శాఖ, మరో డిప్యూటీ సీఎం దినేష్‌ శర్మకు పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యాశాఖలు ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 24 ఏళ్ల పాటు ఉండి, ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి, మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవడు సిద్దార్థ నాథ్‌ సింగ్‌ లాంటి పెద్దవాళ్లకు కూడా మంత్రిపదవులు లభించాయి.



యోగి ఆదిత్యనాథ్‌: ముఖ్యమంత్రి, హోం శాఖ, ఆర్థిక శాఖ

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య: ప్రజాపనుల శాఖ

దినేష్‌ శర్మ: పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్య

చేతన్‌ చౌహాన్‌: క్రీడా శాఖ

అశుతోష్‌ టాండన్‌: ప్రాథమిక విద్యాశాఖ

రీటా బహుగుణ జోషి: సెకండరీ విద్యాశాఖ

మొహసిన్‌ రజా: మైనారిటీ వ్యవహారాలు

స్వామి ప్రసాద్‌ మౌర్య: వ్యవసాయ శాఖ




యోగికి ఐసిస్‌ పేరిట హెచ్చరిక

ఐసిస్‌ సభ్యులమని చెప్పుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు  సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు హెచ్చరిక పంపారు. ఈ నెల 24న పూర్వాంచల్‌లో జరిగే హింసను దమ్ముంటే అడ్డుకోండంటూ సవాల్‌ విసిరారు. ఇస్లామిక్‌ స్టేట్‌ పేరిట ఉన్న ఆ లేఖను బుధవారం పోలీసులు గుర్తించారు. వారణాసిలోని మీర్జామురాద్‌ ప్రాంతంలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాగితంపై పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కూడా రాసి ఉంది. పూర్వాంచల్‌ ప్రాంతంలో హింస సృష్టిస్తామని, ఆ గందరగోళాన్ని ఆపండి అంటూ ఆ లేఖలో రాశారు. ఈ కేసులో పోలీసులు కొందర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top