ఆఫ్రికాలో అద్భుత నిర్మాణం


- ఖండంలోనే అతిపెద్ద ఆకాశహార్మ్యం ‘ది పినాకిల్‌’







నైరోబీ:
ఒకప్పటి ‘చీకటి ఖండం’  ఇప్పుడు సరికొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఆకాశహార్మ్యాల నిర్మాణంతో అదరగొడుతోంది. పశ్చిమ, తూర్పు ఆసియాలోని యుఏఈ, చైనా లాంటి దేశాల్లోని అతిపెద్ద నిర్మాణాలకు ధీటుగా కాకపోయినా, సమీప భవిష్యత్తులో ఆ స్థాయిని అందుకోగలనన్న సంకేతాలిస్తోంది. అందుకు నిదర్శనమే.. కెన్యా రాజధాని నైరోబీలో రూపుదిద్దుకుంటోన్న ‘ది పినాకిల్‌’!



980 అడుగుల ఎత్తుండే ‘ది పినాకిల్‌’  హార్మ్యం.. ఆఫ్రికా ఖండంలోనే అతిపొడవైన నిర్మాణంగా రికార్డులకెక్కనుంది. 72 అంతస్తుల భారీ భవంతిని, దానిని ఆనుకునే 45 అంతస్తులుండే మరో భారీ భవంతిని కలిపి ‘ది పినాకిల్‌’ హార్మ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద భవంతి పొడవు.. 980 అడుగులు (300 మీటర్లు). అంటే, ఇంచుమించు పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌(304 మీటర్లు) ఎత్తన్నమాట! కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఇటీవలే నిర్మాణ పనులను ప్రారంభించారు. 2019 నాటికి ‘ది పినాకిల్‌’ నిర్మాణం పూర్తికానుంది.



‘ది పినాకిల్‌’ ప్రత్యేకతలు కొన్ని..


  • 70 అంతస్తుత పెద్ద భవంతిలో ప్రధానంగా కార్యాలయాలకు చోటు కల్పించనున్నారు. ఇక 45 అంతస్తుల రెండో భవంతిలో ప్రఖ్యాత హిల్టన్‌ హోటల్‌ను నడపనున్నారు.

  • మొత్తం నిర్మాణాలకుగానూ 20 బిలియన్‌ కెన్యన్‌ షిల్లింగ్స్‌ను వెచ్చిస్తున్నారు.

  • ప్రస్తుతానికి జోహన్నస్‌బర్గ్‌(దక్షిణాఫ్రికా)లోని కార్ల్‌టన్‌ సెంటర్‌(732 అడుగులు) భవంతే ఆఫ్రికాలో అతిపెద్ద ఆకాశహార్మ్యం. 2019లో నిర్మాణం పూర్తికాగానే ఆ అతిపెద్ద ఘనత ‘ది పినాకిల్‌’ కు దక్కుతుంది.

  • హెలికాప్లర్లలో ప్రయాణిస్తూ నేరుగా పినాకిల్‌పైనే దిగేలా 800 అడుగుల ఎత్తులో హెలీప్యాడ్‌ను నిర్మించనున్నారు.

  • ప్రపంచ ప్రఖ్యాత ‘హస్‌ పెట్రోలియం అండ్‌ వైట్‌ లోటస్‌ ప్రాజెక్ట్స్‌’ సంస్థ పినాకిల్‌ నిర్మాణాన్ని చేపట్టింది.












Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top