'నా అకౌంట్లో రూ.100కోట్లు పడ్డాయి'

'నా అకౌంట్లో రూ.100కోట్లు పడ్డాయి'

ఘజియాబాద్: తన జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్ల నగదు డిపాజిట్ అయిందని ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఈ-మెయిల్లే పంపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన శీతల్ యాదవ్ కు మీరట్ లో గల ఓ భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచిలో జన్ ధన్ ఖాతా ఉంది. కాగా, ఈ నెల 18వ తేదీన డబ్బు డ్రా చేసుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లిన శీతల్ కు బ్యాలెన్స్ అమౌంట్ ను చూసి షాక్ గురైంది. రూ.99,99,99,394లు తన అకౌంట్లో ఉండటాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని తొలుత నమ్మలేకపోయిన శీతల్.. ఏటీఎం వద్దకు వచ్చిన మరొకరికి చూపించి ద్రువీకరించుకుంది.

 

అప్పటికీ నమ్మలేక దగ్గరలోని ఎస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి మరో మారు బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ ను చెక్ చేసి చూసింది. మరలా ఖాతలో రూ.100కోట్లు ఉన్నట్లు చూపడంతో ఈ విషయాన్ని తన భర్త జైలెదార్ సింగ్ కు చెప్పింది. శీతల్ ను వెంటబెట్టుకుని బ్యాంకు వద్దకు వెళ్లిన జైలెదార్.. బ్యాంకు అధికారులకు డబ్బు విషయాన్ని చెప్పాడు. బ్యాంకు మేనేజర్ అందుబాటులో లేడని మరలా రావాలని వారు చెప్పడంతో మరుసటి రోజు మరలా బ్యాంకుకు వెళ్లగా వేరే కారణాలు చెప్పి మళ్లీ పంపేశారు.

 

దీంతో అనుమానం వచ్చిన జైలెదార్.. ఓ ఎడ్యుకేటెడ్ పర్సన్ కు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆయన సలహాతో సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి అకౌంట్ కు సంబంధించిన వివరాలను పంపినట్లు మీడియాతో చెప్పాడు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top