ఇన్స్టాగ్రామ్ ఆయుధంగా...

ఇన్స్టాగ్రామ్ ఆయుధంగా...


ఆమె...ఓ ప్రముఖ వయోలెనిస్ట్...అయితేనేం ఆమెకూ సామాజిక మాధ్యమంలో తిప్పలు తప్పలేదు. అసభ్యకర, లైంగిక గ్రాఫిక్స్ తో పాటు... బెదిరింపులకూ లోనైంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల సరసన.. వినియోగదారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ఇన్స్టాగ్రామ్లో ఆమెకు అందరిలాగే అసభ్యకర సందేశాలు వస్తుండేవి. వాటికి వేలల్లో హిట్స్ కూడా రావడం ఆమెను ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది.  తనకు ఎదురైన సమస్యను పదేళ్ళపాటు భరిస్తూనే.. చివరికి ఆమె తెలివిగా తిప్పి కొట్టింది. వచ్చిన మెసేజ్లు, గ్రాఫిక్స్, హిట్స్ను స్క్రీన్ షాట్స్గా భద్రపరచి తనను వేధించేవారికే కాక... అటువంటి నీచ మనస్థత్వం ఉండే ప్రతివారికీ గుణపాఠమయ్యేలా సున్నితంగా బుద్ధి చెప్పింది.



లాస్ ఏంజిల్స్కు చెందిన ప్రొఫెషనల్ వయోలెనిస్ట్...  35  ఏళ్ళ 'మియా మట్సూ మియా' సాధారణ మహిళల కంటే భిన్నంగా స్పందించింది. నెల్లాళ్ళ క్రితం మియా.. ప్రాగ్ మాగ్నట్ పేరున ఓ కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించింది. అందులో తాను భద్రపరచిన స్క్రీన్ షాట్స్ను, గ్రాఫిక్ మెసేజ్లను పోస్ట్ చేసింది. ఏషియన్ అమెరికన్ సంగీత కుటుంబానికి చెందిన మియాపై మాటల దాడికి దిగిన పురుషులకు వ్యతిరేకంగా ఓ స్టాండ్ తీసుకుంది. మతి స్థిమితం లేకుండా, అవాకులు చవాకులు పేలే ప్రతివారికీ తన నిర్ణయం ఓ గుణపాఠం కావాలనుకున్న ఆమె తనకు వచ్చిన మెసేజ్లను పోస్ట్ చేస్తూ... దానితోపాటు వారికి బుద్ధి వచ్చేట్టు మరో కామెంట్ను కూడ ఇవ్వడం ప్రారంభించింది.



'మెసేజ్లు చూస్తే నాకు నిజంగా కోపం వచ్చేది. మనుషుల్ని ఇలా ట్రీట్ చేయడం ఎంతమాత్రం భావ్యం కాదు. ఎప్పుడో ఒకసారి సరదాగా మెసేజ్లు చేయడం పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ నా విషయంలో ఇది తరచుగా మారింది. అందుకే నేను ఆ సాక్ష్యాలను భద్రపరచుకున్నాను.' అంటూ తనకు వచ్చిన వేధింపుల మెసేజ్లతో పాటు, ఓ గ్రాఫిక్ దృశ్యాన్ని కూడ ఆమె వాల్పై పోస్ట్ చేసింది. నన్ను మీరు అందంగా చూడాలనుకోవడంలో తప్పులేదు. మీరు పంపిన గ్రాఫిక్స్కు ఎంతగానో ఎట్రాక్ట్ అయ్యాను. అలాగే మీ అందమైన చిత్రాలను కూడ గ్రాఫిక్స్ చేసి పంపిస్తే చూడాలనుకుంటున్నారా? అంటూ ఆమె వ్యాఖ్యలను పోస్ట్ చేసింది.



తనకు వచ్చిన అసభ్య , అభ్యంతరకర పదాలను కాస్త బ్లర్ చేస్తూ పోస్ట్లు పెట్టింది. దీనికి తోడు తన స్నేహితురాళ్ళకు ఎదురైన కొన్ని వేధింపుల వివరాలను కూడా మియా తన పోస్టుల్లో ఉంచింది. 'ఓ ఆసియా అమ్మాయితో నేనెప్పుడు డేట్ చేయలేదు. ఒకసారి నిన్ను డేటింగ్కు పిలుస్తాను. ఆరోజు మీరు నాకు సర్వస్వం సమర్పించేందుకు సిద్ధంగా ఉండండి.' అంటూ  ఓ యువకుడి పేరుతోసహా వ్యాఖ్యలను ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. కేసులు, గొడవల జోలికి పోవాల్సిన అవసరం లేదని, సున్నితంగా బుద్ధి చెప్పేందుకు ఇదో మంచి అవకాశమని మియా అంటోంది.



ఇకపై  సోషల్ మీడియాలో, డేటింగ్ యాప్లలో వచ్చే మెసేజ్లతో వేధింపులకు గురౌతున్న మహిళలంతా ఎటువంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని, ఎంతో పాజిటివ్గా  తమకు వచ్చిన మెసేజ్లను ప్రాగ్ మాగ్నట్లో పోస్ట్ చేసి, పబ్లిక్ చేస్తూ పంపిన వారు తల దించుకునేట్టు చేయాలని సూచించింది.


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top