పెటాను నిషేధిస్తాం: అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ

పెటాను నిషేధిస్తాం: అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ


- జల్లికట్టు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

చెన్నై: జల్లికట్టు అంశంపై తమిళనాడు రగిలిపోతోంది. సాంప్రదాయ క్రీడపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలనే డిమాండ్‌చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తున్నారు. బుధవారం చెన్నై నగరంలోని మెరీనా బీచ్‌కు లక్షల సంఖ్యలో చేరుకున్న ప్రజలు జల్లికట్టును పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ నిరసనలు మిన్నంటాయి.



ప్రజల అభ్యర్థన మేరకు జల్లికట్టుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సుప్రీం ఉత్తర్వులను నిలుపుదలచేసేలా ఆర్డినెన్స్‌ జారీచేయాలని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్‌ కోరారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిషేధానికి కారణమైన జంతు కారుణ్య సంస్థ 'పెటా'ను తమిళనాడులో నిషేధిస్తామని, ఆ మేరకు అవసరమైన న్యాయప్రక్రియను ప్రారంభించామని శశికళ పేర్కొన్నారు.



తమిళనాడు వ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలపై ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అధికారులతో చర్చించారు. ఆందోళనలు విరమించాలని ప్రజలను కోరారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతే ప్రధాన ఎజెండాగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఇదిలాఉంటే, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తేదీలు వెల్లడయ్యేఅవకాశంఉంది. (జల్లికట్టు వేండమా, నిషేధం వేండమా?)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top