ములాయం ఎందుకు బయటకొచ్చారు?

ములాయం ఎందుకు బయటకొచ్చారు? - Sakshi


పాట్నా: బీహార్ రాజకీయాలను ఓ మలుపు తిప్పుతానంటూ జనతా పరివారంను ఏకం చేయడంలో పాత్రధారిగానే కాకుండా సూత్రధారిగా కూడా వ్యవహరించిన సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హఠాత్తుగా ఆ కూటమి నుంచి ఎందుకు బయటకొచ్చారు? తమకు కేవలం ఐదు సీట్లనే కేటాయించడం వల్ల తమ పార్టీ బీహార్ క్యాడర్ నిరాశా  నిస్పృహలకు గురవుతోందని, అందుకనే కూటిమితో తెగతెంపులు చేసుకొని ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చామంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ ఎందుకు ఆదరాబాదరాగా ప్రకటించారు ? (వచ్చేవారం జరగాల్సిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని గురువారం జరిపారు) ఆ మాటకొస్తే సమాజ్‌వాది పార్టీకి బీహార్‌లో క్యాడర్ ఎక్కడుంది ?



2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో ప్రగల్భాలు పలికి ఏకంగా 146 సీట్లకు పోటీచేసి ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయిన గతానుభవం ములాయంకు గుర్తులేదా ? అంతేకాదు, ఒక్క సీటులో కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. క్యాడర్ లేకపోవడం వల్లనే అంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ములాయం సింగ్ చెప్పడం మనకు గుర్తు లేదంటారా?



సరే, కేవలం ఐదు సీట్లు మాత్రమే ఇచ్చి ములాయం సింగ్‌ను జనతా పరివార్ కూటమి అవమానించారనే అనుకుంటే...ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 27వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఎందుకు గంటసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీన జనతా పరివార్ నిర్వహిస్తున్న ‘స్వాభిమాన్ యాత్ర’కు తాను హాజరు కావడం లేదని ఎందుకు ప్రకటించారు. మోదీని మెప్పించడం కోసం కాదా ? ఆ తర్వాత రామ్‌గోపాల్ యాదవ్ కూడా ప్రధాని మోదీతో, ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకోవడం, గంటల తరబడి మంతనాలు జరపడం నేటి పరిణామానికి సూచనలు కావా? అమిత్ షాతో రామ్‌గోపాల్ యాదవ్ చర్చలు జరిపినప్పుడు బీహార్ బీజేపీ నాయకులు కూడా అక్కడే ఉండడం గమనార్హం.



రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు) కూటమి నుంచి తప్పుకోవాల్సిందిగా తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై మొదటి నుంచి బీజేపీ అగ్రనాయకత్వం ఒత్తిడి తెస్తోందని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. యూపీ రాష్ట్ర ప్రయోజనాలతోపాటు తన వ్యక్తిగత ప్రయోజనాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడివడి ఉండడంతో ములాయం సింగ్ బీజేపీ ఒత్తిళ్లకు లొంగి పోయారనే విషయం స్పష్టమవుతూనే ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కున్న ములాయం సింగ్ యాదవ్ అప్పటి యూపీఏ ప్రభుత్వంతో బేరం కుదుర్చుకొని సీబీఐ నుంచి బయటపడ్డారనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఇప్పటికీ ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.



జనతా పరివారం నుంచి బయటకొచ్చి ఒంటరిగా పోటీ చేస్తామని సమాజ్‌వాది నేతలు ప్రకటించిన వెంటనే ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ ఇందులో తమ పార్టీకేమీ సంబంధం లేదని, తాము సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదంటూ బీజేపీ బీహార్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. రాజకీయాల్లో ఏనాడు ముక్కు సూటిగా వ్యవహరించిన దాఖలాలులేని ములాయం... ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకోనూవచ్చు. రాజకీయాల్లో అంటరానితనమంటూ ఉండదంటూ బీజేపీ సమర్థించుకోనూవచ్చు. బీహార్ రాజకీయాలను ములాయం మలుపు తిప్పుతారంటే అది ఇలాంటి మలుపవుతుందని ఓటర్లు భావించకపోనూవచ్చు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top