వీరు మిలిటెంట్లు ఎందుకయ్యారో!

వీరు మిలిటెంట్లు ఎందుకయ్యారో! - Sakshi


కాశ్మీర్ : ఫేస్‌బుక్ పేజీల్లో సర్కులేట్ అవుతున్న ఈ ఫొటోలో యూనిఫామ్‌లు ధరించి కనిపిస్తున్న 11 మంది యువకులు హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన మిలిటెంట్లు. ఈ ఫొటోను తక్షణమే ఫేస్‌బుక్ పేజీల నుంచి తొలగించాలని కోరుతూ జమ్మూకాశ్మీర్ పోలీసులు శుక్రవారం నాడు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వీరిలో పోలీసుల అణచివేత చర్యలను తట్టుకోలేక మిలిటెంట్లలో చేరినవారు ఉన్నారు. పోలీసు విభాగం నుంచి పారిపోయి మిలిటెంట్లలో కలిసిపోయిన కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. గత నెలలో తీసినట్టుగా భావిస్తున్న ఈ ఫొటోలో రెండో వరుసలో మధ్యలో కనిపిస్తున్న 19 ఏళ్ల యువకుడి పేరు బుర్హాన్ ముజాఫర్ వాని. 15వ ఏటనే మిలిటెంట్లలో చేరిన బుర్హాన్ ఈ నాలుగేళ్ల కాలంలోనే ఎంతో ప్రచారం సంపాదించి నేడు కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతని తలపై కాశ్మీర్ పోలీసులు పది లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. అతని ఫొటో సామాజిక వెబ్‌సైట్లలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.

 

2010లో బుర్హాన్‌ను, అతని సోదరుడు ఖలీద్ ముజాఫర్ వానిలను కాశ్మీర్ పోలీసులు తీసుకెళ్లి చితకబాదారని, పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే వారిద్దరు మిలిటెంట్లలో చేరిపోయారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. వారిద్దరు చదువుకున్న వారే. పైగా హైస్కూల్ హెడ్ మాస్టర్ కుమారులు. బుర్హాన్ అనేక సార్లు సైనిక శిబిరాలపై దాడులు జరిపాడని, ఆయుధాలు ఎత్తుకొని పారిపోయాడని కాశ్మీరు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఖలీద్ గత ఏప్రిల్ 13వ తేదీన తన తమ్ముడైన బుర్హాన్‌ను కలుసుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళుతుండగా భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మర ణించాడు. ఇప్పుడు బుర్హాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.



ఈలోగా ఈ ఫొటో సామాజిక వెబ్‌సైట్లలో కనిపించడంతో పోలీసులు కలవరపడుతున్నారు. ఈ ఫొటోలో పోలీసు విభాగం నుంచి పారిపోయిన నజీర్ అహ్మద్ పండిట్ కూడా ఉన్నాడు. కాశ్మీర్ ప్రజా పనుల శాఖ మంత్రి సయ్యద్ అల్తాఫ్ బుఖారి వద్ద వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పుడు నజీర్ అహ్మద్ రెండు ఏకే-47 తుపాకులతో పారిపోయాడు. మిలిటెంట్లలో చేరాలంటే భద్రతా దళాల నుంచి కనీసం ఒక్క అత్యాధునిక ఆయుధమన్న ఎత్తుకరావాలని మిలిటెంట్ కమాండర్లు షరతులు పెట్టడంతో ఆయుధాల కోసం భద్రతా బలగాలపై దాడులు పెరిగినట్టు తెలుస్తోంది.

 

వాస్తవంగా ఫొటోను చూసి తామేమి కలవర పడడం లేదని, అయితే ఇప్పటికీ కాశ్మీర్‌లో మిలిటెన్సీ ఉందని, అది పెరుగుతోందని ప్రజలు భావించే ప్రమాదం ఉండడంతో ఆ ఫొటోను తొలగించాలని తాము కోర్టును కోరామని కాశ్మీర్ ఇనిస్పెక్టర్ జనరల్ ఎస్జే ముజ్దాబా గిలాని మీడియాతో వ్యాఖ్యానించారు. గతంతో పోలీస్తే 2014లో మిలిటెంట్ కార్యకలాపాలు కాశ్మీర్‌లో బాగా తగ్గినప్పటికీ విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగస్థులు కూడా మిలిటెంట్లలో చేరిపోతుండడం కొత్తగా కలవరపెడుతున్న అంశం.

 

 

 

 

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top