ప్రజాతీర్పుతో పరిహాసమా?

ప్రజాతీర్పుతో పరిహాసమా? - Sakshi


ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్న ఫిరాయింపులు

ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్న అవకాశవాద రాజకీయాలు




కోర్టు తీర్పులు, కమిటీల సిఫారసులన్నీ కాగితాలకే పరిమితం అనర్హత పిటిషన్లపై నిర్ణయంలో స్పీకర్ల అంతులేని జాప్యం ఈ పిటిషన్లపై విచారణను ఈసీకి కట్టబెట్టాలంటున్న నిపుణులు సభాకాలం ముగిసిన తర్వాత ఫిరాయింపుదారుడిని ఆరేళ్లదాకా ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా చేయాలని సూచన



దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని, సంతల్లో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనే సంస్కృతికి తెరదించాలనే ఉద్దేశంతో 1985లో తెచ్చిందే ఫిరాయింపుల నిరోధక చట్టం. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. అవకాశవాద రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నాయకులు తెలివిమీరుతూ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో సవరణలు తెచ్చినా... చట్టంలో నిర్దిష్టంగా చెప్పని అంశాలను లొసుగులుగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఫిరాయింపులపై ఆధారపడటం, బేరసారాలకు దిగి పదవులు, డబ్బు ఇవ్వజూపడం పాత సంస్కృతి. అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి నిస్సిగ్గుగా ప్రజాప్రతినిధులను లోబర్చుకొని.. గోడ దూకించడం నయా సంస్కృతి!



చట్టం (రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా) చట్టుబండలవుతున్న పరిస్థితుల్లో అసలు ఫిరాయింపు నిరోధక చట్టం నేపథ్యమేమిటి, ఎప్పుడు తెచ్చారు, సవరణలు ఏం జరిగాయి? కోర్టులు దీంట్లో ఏ మేరకు కల్పించుకొన్నాయి? ఏ లొసుగుల ఆధారంగా చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు? చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎలక్షన్‌ కమిషన్‌తో సహా పలు సంస్థలు, కమిటీలు ఏం సూచించాయి. వీటి అమలులో ఉన్న అనుకూలతలు-ప్రతికూలతలేమిటి? నిపుణుల అభిప్రాయం ఏమిటనే అంశాలపై ‘సాక్షి’ ఫోకస్‌...    - ఎం.కృష్ణకాంత్‌రెడ్డి, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌



ఆయా రామ్‌.. గయా రామ్‌

1967 తర్వాత దేశ రాజకీయాల్లో కొత్తశకం మొదలైంది. ఏక పార్టీ (కాంగ్రెస్‌) ఆధిపత్యం క్షీణించడం మొదలైంది. ఆ ఏడాది 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. ఒకే ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను అస్థిర పరిచే అనైతిక విధానానికి పునాది కూడా పడింది. 1967 నుంచి 83 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 2,700 మంది పార్టీ ఫిరాయించారు. ఇందులో 212 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఫిరాయించి ముఖ్యమంత్రులైన వారు 15 మంది. హరియాణాలో గయాలాల్‌ అనే ఎమ్మెల్యే ఏకంగా మూడుసార్లు పార్టీ మారడంతో... ఫిరాయింపుదారులకు ‘ఆయా రామ్‌- గయా రామ్‌’ అనే పేరు స్థిరపడింది.



అడ్డూ అదుపు లేకుండా ఫిరాయింపులు సాగడంతో మేధావివర్గంలో దీనిపై చర్చ మొదలైంది. 1967లోనే అప్పటి హోంమంత్రి వై.బి.చవాన్‌ నేతృత్వంలో కమిటీ వేశారు. 1973, 1978లలో ఫిరాయింపుల నిరోధక బిల్లును తెచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా 401 సీట్లు గెలిచి భారీ మెజారిటీ సాధించింది. తగినంత సంఖ్యా బలం ఉండటంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. ఆర్టికల్స్‌ 102(2) 191 (2)లను చేర్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని చట్ట సభ్యత్వానికి అనర్హులుగా చేసే అంశాలను పొందుపర్చి.. దీన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో చేర్చారు. తద్వారా ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్‌ లేదా చైర్మన్‌ తీసుకునే చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించడానికి వీల్లేకుండా రక్షణ కల్పించారు.



‘‘రాజకీయ ఫిరాయింపుల భూతం యావత్‌ దేశానికే ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేయకపోతే... మన ప్రజాస్వామ్య పునాదులనే బలహీనపరుస్తుంది’’ అని 52వ రాజ్యాంగ సవరణ అవసరాన్ని, ఉద్దేశాలను వివరించే పత్రంలో పేర్కొన్నారు.



చట్టంలో ఏముంది?

ఏయే సందర్భాల్లో అనర్హులవుతారంటే...

2 (1-ఎ): ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, చట్ట సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోతాడు. స్పీకర్‌ పదవిని చేపట్టే వ్యక్తికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

2 (1-బి): పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఓటింగ్‌కు గైర్హాజరైనా... చట్టసభ సభ్యత్వానికి అనర్హుడవుతారు. గైర్హాజరైన రోజు నుంచి 15 రోజుల్లో పు... పార్టీ నుంచి సదరు సభ్యుడిని క్షమిస్తూ లేఖ వస్తే మాత్రం అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది.

2 (2): స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి.. తర్వాత ఏదైనా పార్టీలో చేరితే సభ్యత్వానికి అనర్హుడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీకైనా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చుగాని పార్టీలో చేరకూడదు.

2 (3): చట్టసభలకు నామినేట్‌ అయిన వారు తమను ఎంపిక చేసిన పార్టీకి విధేయుడై ఉంటారా? లేదా? అనేది ఆర్నెల్లలోపు తేల్చుకోవాలి. ఆర్నెల్ల తర్వాత సదరు నామినేటెడ్‌ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభ సభ్యత్వం రద్దవుతుంది.

► ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుల్లో మూడింట ఒక వంతు మంది పార్టీ మారితే... అది ఫిరాయింపు కిందకు రాదు. మరో పార్టీలో చేరిక అవుతుంది. పార్టీని చీల్చినట్లు కాదు. కాబట్టి అనర్హత వేటు పడదు.

► పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఫిర్యాదులను సదరు సభ స్పీకర్‌ లేదా చైర్మన్‌ పరిశీలిస్తారు. ట్రిబ్యునల్‌గా ఆయన విచారణ చేపడతారు. స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్‌.

► పదో షెడ్యూల్‌లో చేర్చినందున స్పీకర్‌ లేదా చైర్మన్‌ తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించలేవు.



సవరణలు ఇవీ..

చిన్న సంఖ్యలో ఉన్న ఫిరాయింపులను ‘హోల్‌సేల్‌ (మూడింట ఒకవంతు అయితే అనర్హత వేటుపడదు)’గా 1985 ఫిరాయింపుల నిరోధక చట్టం మార్చేసిందని విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంస్కరణలపై వేసిన దినేశ్‌ గోస్వామి కమిటీ, లా కమిషన్‌లు చీలికలను ప్రోత్సహిస్తున్న నిబంధనను తొలగించాలని సిఫారసు చేశాయి. దాంతో ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారిలో మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో చేరితే... అనర్హత వేటు పడదని 2003లో తెచ్చిన 91వ రాజ్యాంగ సవరణలో మార్పు చేశారు. ఇలాంటి కలయికను అంగీకరించకుండా... సొంత పార్టీలోనే(గెలిచిన పార్టీలో) ఉండిపోవాలని అనుకున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా సరే.. వారిపై అనర్హత వేటు పడదు. ఎందుకంటే వీరు మరో పార్టీకి మారడం లేదు కాబట్టి.



నిర్భయంగా ఉల్లంఘనలు..

అనర్హత పిటిషన్‌లపై విచారణకు చేపట్టే విషయంలో పూర్తి అధికారం స్పీకర్‌దే కావడం, కాలపరిమితి అంటూ లేకపోవడం.. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఒక పిటిషన్‌ను పరిష్కరించడానికి ఎన్నేళ్లు తీసుకున్నా... దానికి ఆయన ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. అధికార పార్టీకి చెందిన వారే సాధారణంగా స్పీకర్‌గా ఉంటారు. రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించే ముందు ఆయన తన పార్టీకి రాజీనామా చేసినా.. మాతృపార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నది ఇదే.

► ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రలోభాలతో 21 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం కండువా కప్పారు. వీటిపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్‌ ఎటూ తేల్చకుండా... నాన్చుతున్నారు.

► తెలంగాణలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్‌ మరో లొసుగును వాడుకుంది. మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో కలిస్తే... అనర్హత వేటు తప్పుతుందనేది 2003లో చేసిన సవరణ. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో 15 సీట్లు గెలిచింది. వీరిలో నుంచి 12 మంది ఒక్కసారిగా వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరలేదు. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు చొప్పున విడతల వారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎప్పటికప్పుడు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇస్తూనే ఉంది. ఇలా వెళ్లిన వారు 12 మంది కాగానే.. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని స్పీకర్‌కు వీరొక లేఖ ఇచ్చారు. ముందుగా టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను తేల్చకుండా.. తర్వాత 12 మంది టీఆర్‌ఎస్‌లో కలుస్తున్నామని ఇచ్చిన లేఖను స్పీకర్‌ ఆమోదించారు. వారు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు బులెటిన్‌ను విడుదల చేశారు.

► తెలంగాణలో కేసీఆర్‌ చేసింది అన్యాయమని ఆక్రోశించిన చంద్రబాబు ఏపీలో తాను అదే చేసినపుడు మాత్రం.. నిజాయితీ... నిప్పు అంటూ పొంతనలేని మాటలతో సమాధానాలను దాటవేస్తారు.

► మూడింట రెండొంతుల నిబంధన కూడా దుర్వినియోగమవుతోందని, దీన్ని కూడా రద్దు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఒక పార్టీ ద్వారా గెలిచిన సభ్యులు శాసనసభ్యత్వాన్ని వదులుకోకుండా.. మరో పార్టీలోకి వెళ్లేందుకు ఏ రూపంలోనూ ఆస్కారం ఉండకూడదనేది వీరి వాదన.

► గతేడాది జూలైలో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమితుడైన పెమా ఖండూ రెండు నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీని ఖాళీ చేసి... పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ)లో చేరారు. కాంగ్రెస్‌కు 45 మంది సభ్యులుంటే... 44 మందితో ఖండూ పీపీఏలో చేరారు. మాజీ సీఎం నబోమ్‌ టుకీ ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలిపోయారు. పీపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో ప్రజలు 2014లో కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల కంటే ఎక్కువే మెజారిటీ ఇచ్చారు. అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిన వారు ఈ విస్పష్ట తీర్పును నిస్సిగ్గుగా అవహేళన చేశారు. కేంద్రాల్లో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాతీర్పును ఎలా అపహాస్యం చేశాయో చెప్పేందుకు ఇవన్నీ ఇటీవలి ఉదాహరణలు.



రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తాం. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు.. అదే రాజ్యాంగంలోని నిబంధనలను తోసిరాజాలవు. అందువల్ల పదో షెడ్యూల్‌ ద్వారా స్పీకర్లకు సంక్రమించిన అపరిమిత అధికారాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది.

- ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌



కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి..

ఒక పార్టీ టికెట్‌పై గెలిచాడంటే.. ఆ పార్టీ విధానాలకు ప్రజామోదం లభించి విజయం సాధించినట్లే. కాబట్టి సదరు సభ్యుడు పార్టీకి కట్టుబడి ఉండాలి.

- వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు అభిప్రాయం



కిహోటో హల్లోహన్‌- జచిల్హు, ఇతరుల కేసు (1992): ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించే అవకాశం లేకుండా, పార్టీల లైన్‌కు కట్టుబడి ఉండేలా ఫిరాయింపుల నిరోధక చట్టం చేస్తోందనేది వాదన. ఈ పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు చట్ట సభ్యులకు ఆర్టికల్‌ 105, 194ల ద్వారా సంక్రమించే  హక్కులు, స్వేచ్ఛకు 52వ రాజ్యాంగ సవరణ ఏమాత్రం భంగకరం కాదని తేల్చి చెప్పింది. అలాగే 52 రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన అన్ని అంశాలనూ సమీక్షించింది. స్పీకర్‌ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవన్న  పదో షెడ్యూల్‌లోని 7వ పేరా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.



చట్ట సభ్యుల అనర్హత విషయంలో హైకోర్టులకు ఆర్టికల్‌ 226, 227, సుప్రీంకోర్టుకు ఆర్టికల్‌ 136లకు ఉన్న అధికారాలను హరిస్తోందని తెలిపింది. న్యాయస్థానాల పరిధిని చట్టసభలు కుదించడాన్ని రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్‌లను పరిష్కరించే విషయంలోగాని, జరిగే జాప్యం, ఇతరత్రా నియమావళి ఉల్లంఘన జరిగినా... కోర్టులు ప్రశ్నించజాలవు. సభకు సంబంధించినంతవరకు స్పీకరే సుప్రీం. అయితే స్పీకర్‌ ఒకసారి నిర్ణయం వెలువరించాక మాత్రం... ఆయన తీర్పు రాజ్యాంగానికి లోబడి ఉందా? లేదా? అనేది కోర్టులు సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.



‘‘పార్టీకి రాజీనామా చేయకున్నా... సదరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ప్రవర్తన ద్వారా (ఇతర పార్టీలతో అంటకాగడం, ఇతర పార్టీల సభల్లో పాల్గొనడం, పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం లాంటివి) కూడా అతను తనకు టికెట్టిచ్చిన పార్టీకి దూరమయ్యాడనే నిర్ణయానికి రావొచ్చు’’

- రవినాయక్‌-యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు (1994)



‘‘రాజకీయ పార్టీ నుంచి బహిష్కృతుడైనప్పటికీ... సదరు సభ్యుడు పార్టీ జారీ చేసే విప్‌కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో అనర్హతకు గురవుతాడు. బహిష్కరణకు గురైతే సభలో అన్‌ అటాచ్డ్‌ మెంబర్‌గా పరిగణిస్తారు. కానీ పదో షెడ్యూల్‌ ప్రకారం అతను ఏ పార్టీ తరఫున గెలిచాడో దాని సభ్యుడిగానే పరిగణిస్తారు. కాబట్టి బహిష్కరణ తర్వాత మరో పార్టీలో చేరితే అనర్హుడవుతారు’’

‘‘ఎన్నికైన సభ్యుడు తనను నిలబెట్టిన పార్టీకే చెందుతాడని పదో షెడ్యూల్‌లోని పేరా 2(1) విస్పష్టంగా చెబుతోంది. కాబట్టి బహిష్కరణ వేటు పడినంత మాత్రాన పార్టీకి చెందకుండాపోడు’’

- 1996లో జి.విశ్వనాథన్‌-తమిళనాడు స్పీకర్‌ కేసులో సుప్రీంకోర్టు



‘‘అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత పునఃసమీక్షకు ఆస్కారం లేదు. స్వీయ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం పదో షెడ్యూల్‌ స్పీకర్‌కు కల్పించ లేదు’’

‘‘ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనా, చీలికలు, కలయికలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారించుకోకుండా నిర్ణయం వెలువరించినా... పదో షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకోవడంలో స్పీకర్‌ విఫలమైనట్లే. అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌  పట్టించుకోకపోవడం రాజ్యాంగ విధుల ఉల్లంఘనే’’    

- స్వామి ప్రసాద్‌ మౌర్య-రాజేంద్ర సింగ్‌ రాణా కేసులో సుప్రీంకోర్టు



ఏ కమిటీ ఏం చెప్పిందంటే...

ఎన్నికల సంస్కరణలపై వేసిన దినేశ్‌ గోస్వామి కమిటీ (1990)

► అనర్హత వేటును పరిమిత సందర్భాల్లోనే వేయాలి. 1. తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని వదులుకొన్నపుడు చట్ట సభ్యత్వానికి అనర్హుడిని చేయాలి. 2. ప్రభుత్వంపై విశ్వాస, అవిశ్వాస పరీక్షల సందర్భంగా మాత్రమే సభ్యుడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా, గైర్హాజరైనా అనర్హుడిని చేయాలి.

► అనర్హత పిటిషన్‌లను రాష్ట్రపతి లేదా గవర్నర్‌ (పార్లమెంటుకైతే రాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ, మండలిలకైతే గవర్నర్‌) ఎన్నికల సంఘం సలహా మేరకు పరిష్కరించాలి. అంటే స్పీకర్‌ వద్ద నుంచి ఈ అధికారాన్ని తీసివేయాలని సిఫారసు చేసింది.

లా కమిషన్‌ (170వ నివేదిక- 1999, 255వ నివేదిక 2015)

► రాజకీయ పార్టీల్లో చీలికలు, కలయిలకు ఆస్కారమే ఉండకూడదు. దీనికి వీలు కల్పిస్తున్న నిబంధనలు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తొలగించాలి.

► ఎన్నికలకు ముందు పొత్తుల ద్వారా ఏర్పడే కూటములను రాజకీయ పార్టీలుగా గుర్తించాలి. దీంతో ఎన్నికల తర్వాత కూటమిలో నుంచి విడిపోయి అధికారం కోసం మరో పార్టీతో జట్టుకట్టే ఆస్కారం, లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆస్కారం ఉండదు.

► ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో ఉన్నపుడు మాత్రమే రాజకీయ పార్టీలు విప్‌లను జారీ చేయాలి. ఇతర సందర్భాల్లో విప్‌లు వాడకూడదు.

ఎన్నికల కమిషన్‌

► అనర్హత పిటిషన్‌లపై నిర్ణయాన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్‌ తీసుకోవాలి. ఎన్నికల కమిషన్‌ సలహాను వీరు విధిగా పాటించాలి.

రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ (2002)

► ఫిరాయింపుదారులు... ఆ సభా కాలం ముగిసే దాకా మరే ఇతర పదవి, లేదా లాభదాయక రాజకీయ పదవిని చేపట్టకుండా నిషేధించాలి. మంత్రి పదవులపై ఆశతో పార్టీ మారకుండా అడ్డుకోవడానికి ఇది దోహదపడుతుంది.

► ఫిరాయింపునకు పాల్పడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓటు వేసే సభ్యుల ‘ఓటు’ను చెల్లనిదిగా పరిగణించాలి. ప్రస్తుతం ఇలా ఓటు వేస్తే అది చెల్లుతోంది. తర్వాత సదరు సభ్యుడు అనర్హతకు గురికావొచ్చు కాని... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. అస్థిరతకు తావివ్వకుండా ఇలాంటి ఓటును చెల్లనిదిగా పరిగణించాలని... అప్పుడు ప్రలోభాలకు తెరపడుతుందని రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ అభిప్రాయపడింది.



గవర్నర్‌కిస్తే న్యాయం జరుగుతుందా?

దినేశ్‌ గోస్వామి కమిటీ, ఎన్నికల కమిషన్‌లు రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్‌లను పరిష్కరించే అధికారాన్ని గవర్నర్‌కు కట్టబెట్టాలని సూచించాయి. అయితే గవర్నర్‌ ఎవరు? రాష్ట్రాల్లో కేంద్రానికి ప్రతినిధి. గవర్నర్లను నియమించేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే. కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే... పదవీకాలం మిగిలి ఉన్నా సరే గవర్నర్లను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. ఆ స్థానాల్లో తమవారిని నియమిస్తున్నారు. క్రీయాశీల రాజకీయాలకు దూరమైన, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఆయా రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారు.



రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటే.. లేదా కూటమిలో భాగస్వామి అయితే, లేదా వారి మిత్రపక్షమో అయితే... గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అనర్హత పిటిషన్‌లపై స్పీకర్‌ లాగే ఎటూ తేల్చకుండా నాన్చరని చెప్పగలమా? స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి లేదా రాష్ట్రపతి పాలన పెట్టడానికి గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు.



ఇదేనా చట్టం స్ఫూర్తి..?

అధికార పక్షం వైపు యథేచ్చగా ఎమ్మెల్యేలు వెళ్లిపోతే... దీనికి అడ్డుకట్ట పడేదెలా? అనర్హత పిటిషన్‌ వచ్చాక ఏళ్లుగా స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. సదరు సభ్యుడు పార్టీ మారినా... శాసనసభ్యుడిగా వచ్చే వేతనాన్ని, ఇతర సదుపాయాలను నిరంతరాయంగా అందుకుంటాడు. ఎన్నికలకు ఏ రెండు నెలల ముందో అనర్హత పిటిషన్‌ ఎదుర్కొంటున్న సభ్యుడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడు. దాంతో పిటిషన్‌ మూలన పడుతుంది. పార్టీ మారిన సదరు సభ్యుడు ఎలాంటి చర్యా లేకుండా..  తన పదవీ కాలాన్ని పూర్తి చేసేస్తాడు. ఇదేనా ఫిరాయింపుల చట్టం స్ఫూర్తి? ఇదేనా మనమిచ్చే భాష్యం? ఫిరాయించి... పదవీకాలం చివర్లో రాజీనామా చేసిన వారిపై.. దాఖలైన పిటిషన్‌లకు విచారణార్హత ఉండదా? దీనిపై చట్టంలో ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి దీన్ని ఒక లొసుగుగా వాడేసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సరిచేసి బలోపేతం చేయాలని పలు కమిటీలు చాలా కాలం కిందటే సూచించాయి.



నిపుణుల సూచనలివీ..

మొత్తానికి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాల్సిన సమయం వచ్చిందనేది రాజ్యాంగ నిపుణులు, మేధావుల అభిప్రాయం. ప్రజాస్వామ్య విలువకు పాతరేసేందుకు ఆస్కారమిస్తున్న, అవినీతిని పెంచుతున్న చట్టాన్ని సమీక్షించాలని సూచిస్తున్నారు. ఆ సూచనలివీ..

► అనర్హత పిటిషన్‌లను పరిష్కరించే అధికారాన్ని ఈసీకే కట్టబెట్టాలి. జాప్యానికి ఆస్కారం లేకుండా పిటిషన్‌ను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టాలి.

► రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ సూచించినట్లుగా ఫిరాయింపుదారు ఓటు చెల్లకుండా చేయాలి. అప్పుడే కప్పదాట్లు ఆగుతాయి.

► అనర్హత వేటు పడితే... ఆ సభా కాలం ముగిసిన తర్వాత మరో ఆరేళ్ల దాకా (అంటే రాబోయే రెండు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడై... పదేళ్లకు పైగానే రాజకీయాలకు దూరమవ్వాల్సి వస్తుంది) ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా నిషేధించాలి. (ప్రస్తుతం క్రిమినల్‌ కేసుల్లో రెండేళ్లకు మించి జైలు శిక్ష పడ్డ వారు శిక్షాకాలం తర్వాత ఆరేళ్ల దాకా పోటీకి అనర్హులనే నిబంధన ఉంది. దీన్నే ఫిరాయింపులకు వర్తింపజేయాలనేది సూచన).

► ఫిరాయింపుదారులపైనే కాకుండా వారిని చేర్చుకొంటున్న పార్టీలపైనా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పు తేవాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top