హత్య నిజం.. హంతకులెవరు?

నిందితులను కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులు, ఇన్సెట్లో హిమబిందు (ఫైల్) - Sakshi


= హిమబిందు కేసులో వీడని మిస్టరీ

= నిందితులు నిర్దోషులని కోర్టు తీర్పు

= పోలీసుల వైఫల్యంపై సర్వత్రా విమర్శలు


 

విజయవాడ సిటీ : హిమబిందు.. సాధారణ బ్యాంక్ మేనేజర్ భార్య. పూజలు, పునస్కారాలు తప్ప ప్రపంచం తెలియని అమాయకురాలు. అలాంటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆ తర్వాత దారుణంగా హతమార్చారు. ఆమె హత్య నిజం. కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. మరి ఈ దారుణానికి ఒడిగట్టిందెవరనేది తేల్చాల్సిన పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు.

 

 అరెస్టు చేసిన వారి వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగిందే తప్ప గట్టి ఆధారాలు సేకరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని కోర్టు తీర్పుతో వెల్లడైంది. పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన అత్యాచారం, హత్యపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాంక్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, విద్యార్థినులు అప్పట్లో ఆందోళన చేశారు. చివరకు రాష్ట్ర గవర్నరు సైతం హిమబిందు కేసు దర్యాప్తులో పోలీసుల తీరుపై ఆరా తీశారు. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ప్రభుత్వం కూడా కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో నాలుగో నిందితునిగా పేర్కొన్న జనపాల కృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చాడు. దీనిపై ఆగ్రహించిన అప్పటి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు అప్పటి పటమట ఇన్‌స్పెక్టర్ రవికాంత్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసు విచారణ సమయంలో పలుమార్లు పోలీసు కమిషనర్ స్వయంగా కోర్టుకు వెళ్లి పరిశీలించారు. ఎందరెంత మొత్తుకున్నా పోలీసులు తగు విధంగా దర్యాప్తు చేయలేదనడానికి కేసు కొట్టివేత, కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

 

 కోర్టు ఎత్తి చూపిన లోపాలు

 హతురాలిపై అత్యాచారం జరిగినట్టు శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణ, ప్రధాన నిందితుడు ఉపయోగించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు చెపుతూ ఆ ఫోన్ సాంకేతికతను దృష్టిలో ఉంచుకోకపోవడం లోపాలుగా చెప్పొచ్చు. 15వ తేదీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు మొదటి నిందితుని యజమాని ఇంట్లో భద్రపరిచిన మృతదేహాన్ని సమీపంలోని బందరు కాల్వలో పడేసినట్టు పేర్కొన్నారు. వీరా ప్రాంతంలో లేరంటూనే మృతదేహాన్ని కాల్వలో పడేశారనేందుకు ఆధారాలు చూపలేదు. ఘటనకు ముందు వీరు సమీపంలోని షామియానా షాపులో కుట్ర చేసినట్టు తెలిపారు. దీనిపై యజమానిని విచారించి ఆధారాలు చూపలేదు. అత్యాచారం చేసే సమయంలో నోటికి అడ్డుగా పెట్టిన ఖర్చీఫ్, గొంతుకు బిగించి చంపిన చీర, ఘటన తర్వాత గదిని శుభ్రం చేసినట్టు చెపుతున్న క్లాత్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో స్వాధీనం చేయలేదని తీర్పు సమయంలో న్యాయమూర్తి వెల్లడించారు.

 

 తొలుత నగలు పోయిన విషయం చెప్పలేదని, ఆ తర్వాత నిందితులు దొరికిన తర్వాత వాటిని ప్రస్తావించారని చెబుతున్నారు. కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మోదుమూడి సాయిరామ్ 19వ తేదీ వరకు పోలీసులు తమ ఇంటికి రాలేదని చెపుతుంటే 18న ఇంట్లోని ఆధారాల సేకరణ వీడియో సాక్ష్యంతో ఎలా సేకరించారనేది కోర్టు ప్రస్తావించింది. కేసులో కీలకమైన వాచ్‌మెన్‌ను, మరికొందరిని విచారణ నుంచి తప్పించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇలా పోలీసులు మోపిన అన్ని అభియోగాల్లో ఏ ఒక్కదానికి కూడా తగిన సాక్ష్యాలు చూపించలేకపోవడం పోలీసుల వైఫల్యానికి మచ్చుతునక.

 

 తొలి నుంచి ఇదే ధోరణి

 పోలీసుల ధోరణి తొలి నుంచి కూడా ఇలాగే ఉందంటూ సోదరుడు ఉదయ భాస్కర్‌తో పాటు ఇతర బంధువులు ఆరోపించారు. తీర్పు సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న హతురాలి భర్త సాయిరామ్ మాట్లాడేందుకు నిరాకరించగా.. ఇతరులు మాట్లాడుతూ పై కోర్టులోనైనా న్యాయం కోసం పోరాడుతామని వారన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top