షాకిచ్చిన వాట్సప్‌!

షాకిచ్చిన వాట్సప్‌! - Sakshi


గ్లోబల్‌ మెసెజింగ్‌ సర్వీస్‌ వాట్సప్‌ తాజాగా ఓ షాకింగ్‌న్యూస్‌ వెల్లడించింది. తన యూజర్ల ఫోన్‌నంబర్లన్నింటినీ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందజేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పింది. దీనివల్ల వాట్సప్‌ యూజర్లకు ఫేస్‌బుక్‌లో భారీగా లక్షిత వాణిజ్య ప్రకటనలు వెల్లువెత్తే అవకాశముంది. వాట్సప్‌లో మాత్రం గతంలో మాదిరిగా ఎలాంటి యాడ్స్‌ రావు.



వాట్సప్‌ తాజా చర్య వ్యూహాత్మకమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా యూజర్లు కలిగిన వాట్సప్‌ ఇప్పటివరకు వారి సమాచార భద్రతకు పూర్తి భరోసా ఇస్తూ వచ్చింది. తాజాగా కూడా తమ సమాచారం ఫేస్‌బుక్‌కు అందజేయకుండా ఉండేందుకు యూజర్లకు పరిమిత సమయాన్ని ఇచ్చింది. తమ ఫోన్‌ నంబర్లు ఫేస్‌బుక్‌కు తెలుపకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో ఓ బాక్స్‌ను అన్‌టిక్‌ చేసుకొనే సదుపాయాన్ని యూజర్లకు కల్పించింది. కానీ, ఈ అన్‌చెకింగ్‌ బాక్స్‌ గురించి యూజర్లకు పెద్దగా తెలియదు. అంతేకాదు, తాము ఫేస్‌బుక్‌ ఇచ్చిన ఫోన్‌నంబర్లను ఆన్‌లైన్‌లో పోస్టుచేయడంగానీ, ఇతరులకు ఇవ్వడంగానీ జరగదని వాట్సప్‌ అంటోంది. కానీ, ఈ వ్యవహారంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



రెండేళ్ల కిందట రూ. 21.8 బిలియన్‌ డాలర్ల భారీమొత్తానికి వాట్సప్‌ను సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. అప్పటినుంచి వాట్సప్‌ ద్వారా డబ్బు సంపాదించడానికి పెద్ద ఎత్తున ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తోంది.



యూజర్ల ప్రైవసీని కాపాడుతామని, వాణిజ్య ప్రకటనలకు వాట్సప్‌ మెసెజింగ్‌ వేదికను దూరంగా ఉంచుతామని దాని సహస్థాపకులు గతంలో ప్రకటించారు. వారి హామీని నిలబెట్టుకుంటానని, వాట్సప్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని దీనిని కొనుగోలు చేసేటప్పుడు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. కానీ, తాజాగా వాట్సప్‌ ప్రైవసీ పాలసీలో, నియమనిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. వాణిజ్య సంస్థలు తమ వాణిజ్య అవసరాలకు వాట్సప్‌ను వాడుకునేందుకు వీలు కల్పించేలా, వాట్సప్‌ ద్వారా వ్యాపారసంస్థలు తమ వినియోగదారులకు కమ్యూనికేట్‌ చేసేలా అవకాశం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చారు. అంటే ఇకముందు కంపెనీలు తమ వినియోగదారులకు కొనుగోలు రిసిప్ట్‌లు, రిజర్వేషన్‌ ధ్రువీకరణ పత్రాలు, అప్‌డేట్‌ను వాట్సప్‌ ద్వారా అందించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top