షీనా కేసులో కీలక ఆధారాలు మాయం!

షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపుతున్న బుద్రుక్ గ్రామస్తుడు ('మిడ్ డే' పత్రిక తాజా సంచికలో ఈ ఫొటోను ప్రచురించింది)


సంచలనం రేపుతున్న షీనా బోరా హత్య కేసులో గంట గంటకూ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న మూడు వస్తువులు మాయం అయినట్లు  తాజా సమాచారం.



షీనా బోరాను హత్యచేసి కాల్చి, పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గులాబి రంగు వస్త్రం, ఒక దంతం, కుడి చేతి ఎముక ఏమైపోయాయో, ఎక్కడున్నాయో ఎంతకీ అంతుచిక్కడంలేదు . ఆ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ల్యాబ్ అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణియే తన పలుకుబడిని ఉపయోగించి ఆధారాలను మాయం చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



దుర్వాసన వస్తోందని..

రాయ్గఢ్ జిల్లా పేన్ తాలూకా గగోబె బుద్రుక్ గ్రామస్తులు.. 2012, మే 23న పేన్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామం సమీపంలోని అటవీప్రాంతం నుంచి దుర్వాసన వస్తున్నదని, ఓ సారి వచ్చి చూడాల్సిందిగా కోరారు. సంఘటనా స్థలానికి  వెళ్లిన పోలీసులకు అక్కడే పడిఉన్న ఒక వస్త్రం, దంతం, ఎముకలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. సీన్ కట్ చేస్తే..



డ్రైవర్ వాగ్మూలంతో బట్టబయలైన షీనా బోరా హత్యోదంతాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల.. పేన్ పోలీసులు స్వాధీనం చెసుకున్న వస్తువుల గురించి తెలిసింది. దీంతో ముంబై పోలీసులు వెంటనే పేన్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. అటుపై కలీనాలోని ఎఫ్ఎస్ఎల్కు వెళ్లారు. కానీ అక్కడ ఆ ఆధారాలు కనిపించలేదు.



పైగా పేన్ పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు ఒక మహిళకు సంబంధించిన మూడు వస్తువులేవీ తమ వద్దకు రాలేదని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న ముంబై పోలీసులు.. 2012లో  ల్యాబ్ ఇన్చార్జిలుగా పనిచేసిన వారందరినీ ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. పొరపాటునగానీ ఈ ఆధారాలు మరో ల్యాబ్ కు చేరి ఉంటాయా? అనే అనుమానంతో ముంబైలోని జేజే హాస్పిటల్ ల్యాబరేటరీ రికార్డులను కూడా పరిశీలించారు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top