ఆర్థిక సంవత్సరానికి లాభాల స్వాగతం


బ్యాంక్ షేర్ల ర్యాలీ

యూరో మార్కెట్ల ప్రభావం

303 పాయింట్ల లాభంతో 28,260కు సెన్సెక్స్

95 పాయింట్ల లాభంతో 8,586కు నిఫ్టీ


 

 

స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి శుభారంభం పలికింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం, యూరోప్ మార్కెట్లు పెరగడం  స్టాక్ మార్కెట్ జోరును పెంచింది. తక్కువ ధరల్లో లభ్యమవుతున్న షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫార్మా షేర్ల జోరుతో  కొత్త సంవత్సరం తొలి రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 28,260 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి(1.12 శాతం) 8,586 వద్ద ముగిశాయి.గత మూడు సార్లూ వారాంత నష్టాల్లో ముగుస్తూ వచ్చిన స్టాక్ మార్కెట్ తొలిసారిగా ఈ వారం లాభాల్లో ముగిసింది.  స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి పెరిగాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.3 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం చొప్పున పెరిగాయి.



ఈ వారంలో సెన్సెక్స్ లాభం 3 శాతం



మంగళవారంతో పోల్చితే బీఎస్‌ఈ సెన్సెక్స్ నష్టాల్లోనే ప్రారంభమైంది.   ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మరింత నష్టాలకు గురైంది. ఒక దశలో 27,889 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల జోరు కారణంగా 28,298 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 303 పాయింట్ల లాభం(1 శాతం)తో 28,260 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఒక దశలో 8,603 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.



మంగళవారం వెలువడిన కీలక రంగాల గణాంకాలు బలహీనంగా ఉండడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెంటిమెంట్ బలహీనంగా ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్  చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకునే అవకాశాలున్నాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టిందని వివరించారు. బ్యాంకింగ్ షేర్ల కారణంగా ఈ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 3 శాతం లాభంతో ముగిసిందని కోటక్ సెక్యూరిటీస్  హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు.



సన్ ఫార్మా జోరు



ర్యాన్‌బాక్సీ విలీనం, రూ.1,241 ధరకు చేరుతుందన్న మోర్గాన్ స్టాన్లీ అంచనాలతో సన్ ఫార్మా షేరు 5.5 శాతం పెరిగి రూ.1,081 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(1,094)కు చేరింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఏప్రిల్ 7 ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో బ్యాంక్ షేర్లు, ఆర్థిక సంస్థల షేర్లు పెరిగాయి. ఎరువుల రంగానికి గ్యాస్ పూలింగ్ విధానాన్ని కేంద్రం ఖరారు చేయడంలో  ఈ రంగం షేర్లు 3-12 శాతం రేంజ్‌లో పెరగ్గా, గెయిల్ ఇండియా, ఓఎన్‌జీసీలు నష్టపోయాయి. తమ ఐటీ ఆదాయం బలహీనంగా వుండవచ్చని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హెచ్చరించడంతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి.



ఐపీవోలకు మరో ఐదు కంపెనీల దరఖాస్తు



క్యాధలిక్ సిరియన్ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి సంబంధించిన పత్రాలను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించింది. ఈ బ్యాంక్‌తో పాటు మరో నాలుగు సంస్థలు- దిలిప్ బిల్ట్‌కాన్, నవ్‌కార్ కార్పొరేషన్, ప్రభాత్ డైరీ, ఎంఎం ఆటో ఇండస్ట్రీస్‌లు ఐపీఓ ప్రతిపాదనలతో సెబీ ముందుకు వచ్చాయి. ఈ ఐదు సంస్థలు కలిసి కనీసం రూ.2,000 కోట్లు  ఐపీఓల ద్వారా సమీకరిస్తాయని అంచనా.  ఐపీఓల ద్వారా క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ రూ.400 కోట్లు, నవ్‌కార్ కార్పొరేషన్ రూ.600 కోట్లు, దిలిప్ బిల్డ్‌కాన్ రూ.650 కోట్లు, ప్రభాత్ డైరీ రూ.300 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. ఈ ఏడాది ఐపీఓల వెల్లువ తప్పదని నిపుణులంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 12 కంపెనీలు ఐపీఓ అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.

 

రెండు రోజులు సెలవు

గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ 2 రోజులు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఫారెక్స్‌క, మనీ, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు పనిచేయవు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మళ్లీ వచ్చే సోమవారం ప్రారంభమవుతాయి. గురువారం బులియన్ మార్కెట్ పనిచేస్తుంది. ఇక శుక్రవారం రోజు మెటల్, షుగర్, పెప్పర్ మార్కెట్లు పనిచేస్తాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top