వెల్కమ్ టూ ఇండియా

వెల్కమ్ టూ ఇండియా - Sakshi


 రూ. 17,77,477కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

 

 ప్రణాళికేతర వ్యయం : రూ. 13,12,200 కోట్లు

 స్థూల పన్ను వసూళ్లు : రూ. 14,49,490 కోట్లు

 మౌలికవసతుల కల్పన: రూ. 70,000కోట్లు

 సంపద పన్ను రద్దు కోటి ఆదాయం దాటితే 2 శాతం అదనపు సర్‌చార్జి

 ప్రణాళికా వ్యయం : రూ. 4,65,277 కోట్లు

 పన్నుల్లో రాష్ట్రాలకు : రూ. 5,23,958 కోట్లు

 గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీలకు : రూ. 77,526 కోట్లు

 కార్పొరేట్ పన్ను నాలుగేళ్లలో 5 శాతం తగ్గింపు

 రక్షణ రంగానికి రూ. 2,46,727 కోట్లు

 పన్నేతర ఆదాయం రూ. 2,21,733 కోట్లు

 విద్యా రంగానికి రూ. 69,074 కోట్లు

 సేవా పన్నుల బాదుడు ఐటీ మినహాయింపులు లేవు

 

 ఒకేరోజు... రెండు మ్యాచ్‌లు. ఒకటి పార్లమెంట్లో బడ్జెట్ మ్యాచ్. రెండోది ఆస్ట్రేలియాలో భారత్ మ్యాచ్.

 అసలే ఊపుమీదున్న ధోనీ సేన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ తీసుకుని బౌండరీల పండుగ చేస్తుందని అభిమానులు ఎన్నెన్నో లెక్కలు వేసుకున్నారు. భారీ స్క్రీన్లు ముందేసుకుని కూర్చున్నారు. కానీ ‘టాస్’ ఆ అవకాశం ఇవ్వలేదు. ఫలితం... మన సేన గెలిచింది. కానీ ఆశించిన ఆట మిస్సయింది.

 

 భారీ ఎన్నికల విజయంతో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్న మోదీ ఆర్థిక సేనాని అరుణ్ జైట్లీ కూడా పన్ను మినహాయింపు సిక్సర్లతో అలరిస్తారని మధ్యతరగతి ఆశించింది. కానీ సర్వీస్ ట్యాక్స్ పెంచి గూగ్లీ వేశారు. కార్పొరేట్లను మాత్రం కలసి ఆడుదాం... రమ్మన్నారు. వచ్చే ఐదేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఏటా ఒక శాతం చొప్పున 5 శాతం తగ్గించటం... పన్ను ఎగవేతల్ని నివారించడానికి  గతంలో ప్రణబ్ ప్రవేశపెట్టిన ‘జనరల్ యాంటీ-ఎవాయిడెన్స్ రూల్స్ (గార్)’ను రెండేళ్ల పాటు వాయిదా వేయటం ...  సంపద పన్ను రద్దు చేయటం సహా దేశీయ కార్పొరేట్లకు బోలెడన్ని వరాలిచ్చారు. మీరూ రండి... అని విదేశీ మదుపరులను, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ తాము ఆవిష్కరించనున్న ఆధునిక భారతాన్ని బడ్జెట్లో చూపించారు.

 

 మౌలిక సదుపాయాలపై ఈ ఏడాది రూ.70వేల కోట్లు పెట్టుబడి పెడతామని... భారతీయులందరి చేతుల్లో ఇక నుంచి డబ్బుల నోట్లు కాకుండా ప్లాస్టిక్ కార్డులుండేలా డిజిటల్ బ్యాంకింగ్‌ను తెస్తామని... అట్టడుగు స్థాయిల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల్ని పారిశ్రామిక వేత్తల్ని చేయడానికి ‘ముద్ర’ పేరిట రూ.20వేల కోట్ల నిధితో సంస్థను ఏర్పాటు చేస్తామని, టెక్నాలజీ స్టార్టప్‌లకు రూ.వెయ్యి కోట్లిస్తామని, కార్మికులకు ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్ వంటివి తప్పనిసరి చేయకుండా ఇతర పెన్షన్ స్కీమునో, ఆరోగ్య బీమానో ఎంచుకునే అవకాశాన్నిస్తామన్నారు. ఇవన్నీ కలిపిన ఆధునిక భారతాన్ని ఆవిష్కరిస్తూ... రారమ్మని విదేశీ పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడి దారుల్ని ఆహ్వానించారు. ఒకరకంగా వ్యాపార వర్గాల మనసు గెలిచారు. కాకపోతే ఇండియా మ్యాచ్ మాదిరే ఆశించిన ‘ఆట’ మాత్రం మిస్సయింది. గెలుపు దిశగా ఒక అడుగు పడినా... వేగం మాత్రం దూరమయింది. అదే ఈ బడ్జెట్ మ్యాచ్ ప్రత్యేకత.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top