నో డౌట్‌.. డైరెక్టర్‌ వర్మ అరెస్టు ఖాయం!

నో డౌట్‌.. డైరెక్టర్‌ వర్మ అరెస్టు ఖాయం! - Sakshi

  • సిట్‌ విచారణను ఆటంకపరిచేలా వ్యాఖ్యలు చేశారు

  • ఆయనపై కేసు పెడుతాం...

  • హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్‌ అధికారులపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, సిట్ అధికారులపై వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ చేపడుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు.



    రాంగోపాల్‌ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, సాయంత్రం ఆయనపై ఆబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ లేదా ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేస్తామని తెలిపారు. సిట్‌ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్టు ఖాయమని, నో డౌట్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌ కేసులో విచారణను ఆటంకపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అకున్‌ సబర్వాల్‌ ఫొటో పెట్టి బాహుబలి-3 అంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం చాలా అభ్యంతరకరని మండిపడ్డారు.



    డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజులకు మద్దతుగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'సిట్ అధికారులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే తెలుగు ఆర్టిస్టుల సంఘం 'మా' సైతం తప్పుబట్టింది.


     
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top