ప్రత్యేక ప్యాకేజీ మాకూ కావాలి


- వెనుకబడిన తెలంగాణకు తప్పక అవసరం

- కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో గులాబీ నేతలు

సాక్షి, హైదరాబాద్:
తెలంగాణకూ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీనిపై గొంతు విప్పుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేస్తున్న అభివృద్ధి పనుల కోసం కేంద్రం సాయం తప్పనిసరని, అందుకే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో దానిని అందించాలని పేర్కొంటున్నారు. ‘ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి మేం వ్యతిరేకం కాదు. అరవై ఏళ్ళుగా అన్ని రంగాల్లో దోపిడీకి గురై  వెనకబడిన తెలంగాణను సమస్యల నుంచి బయట పడేయడానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలంటున్నాం..’ అని అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వివరించారు.

 

ఏపీ ప్రయత్నాలతో చలనం...

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కోసం లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పసిగట్టిన టీఆర్‌ఎస్ తానూ డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలసి ప్యాకేజీ ఇవ్వకపోతే రాష్ట్రానికి ఎంతో నష్టమని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను గమనించిన గులాబీ నేతలు తెలంగాణకూ ప్రత్యేక ప్యాకేజీ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇటీవల ప్రధాని  బీహార్‌కు లక్షన్నర కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.



ఆ మాదిరి ప్యాకేజీ తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం మేరకు ఏపీకే సాయం ప్రకటిస్తే ఊరుకోమని, అదే చట్టం తమకూ వర్తి స్తుంది కాబట్టి తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. లేదంటే  కేంద్రంపై పోరాటం తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మా పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు. పోరాటాలూ కొత్త కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన  మా నేత కేసీఆర్ కళ్లు తెరిస్తే యుద్ధమే..’ అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ బహిరంగంగానే ప్రకటించారు. ఢిల్లీ స్థాయిలో దీక్షలకూ వెనకాడమని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు మాని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకే జీ ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎదురుదాడి చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top