'ఆ దేశంలో మేం పడ్డ బాధలు వర్ణనాతీతం'


బొబ్బిలి: బతుకుతెరువుకోసం విదేశాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడ్డామని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పలువురు కార్మికులు తెలిపారు. ఇరాన్‌ నుంచి అతి కష్టమ్మీద స్వస్థలాలకు చేరుకున్న కార్మికులు సోమవారం విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి మండలం రంగరాయపురానికి చెందిన పి.అచ్యుతరావు, పి.తిరుపతినాయుడు, చెల్లారపువలసకు చెందిన సీహెచ్‌.భాస్కరరావు, పిరిడికి చెందిన జి.వేణుగోపాలనాయుడు, ఇందిరమ్మకాలనీకి చెందిన వై.శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, సీహెచ్‌ సింహాచలం 2016 జూలైలో పని నిమిత్తం మధ్యవర్తి చేతిలో మోసపోయి టర్కీకి బదులు ఇరాన్‌ వెళ్లారు.



ఈ వ్యవహారంలో పలాసకు చెందిన జయరాం అనే వ్యక్తి వారిని మోసం చేశాడు. ఇరాన్‌ చేరుకున్నాక వారి వద్ద ఉన్న పాస్‌పోర్టులు లాక్కొని అక్కడి కంపెనీ రోజుకు 12గంటలకు పైగా పనిచేయించుకుంది. కానీ, నెలకు రూ.40వేలని చెప్పి రూ.25వేలు మాత్రమే చెల్లించింది. రోజుకు ఒక్కసారే చాలీచాలని తిండి పెట్టేవారని, ఇలా తమను నానా ఇబ్బంది పెట్టిన ఆ కంపెనీ ఢిల్లీకి చెందిన అభయ్‌ అగర్వాల్‌దేనని వారు తెలిపారు.



తమను అంతర్జాతీయ టెర్రరిస్టులుగా ముద్రవేయించి అరెస్టు చేయిస్తామని బెదిరించారని, ఇండియా తిరిగి వస్తామని అనుకోలేదని వారంతా ఆవేదన చెందారు. వాట్సాప్‌లో జిల్లా పాత్రికేయులకు సమచారం అందించడంతో వారు ఇచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించడంతో తాము క్షేమంగా స్వగ్రామాలకు చేరుకున్నామని తెలిపారు. తమను ఈ నెల 9న ఇరాన్‌లో విమానం ఎక్కించారని, ఇండియానుంచి 30మంది వెళ్లామని, తొలిబ్యాచ్‌లో 23మందిని పంపి ముంబై చేరుకునేసరికి తమకు రూ.8వేలు అందించారన్నారు. తమ బకాయిలు చెల్లించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుని మధ్యవర్తి జయరాం, కేబీ ఫెర్రోఎల్లాయిస్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top