చలో ‘అమరావతి’పై మరో కమిటీ

చలో ‘అమరావతి’పై మరో కమిటీ - Sakshi


విజయవాడ, గుంటూరులకు ప్రభుత్వ శాఖలు!

తాత్కాలిక ఏర్పాట్ల పరిశీలనకు కమిటీ

ఐదుగురు ఐఏఎస్ అధికారులతో అధ్యయనం

దశలవారీగా తరలిస్తామన్న మంత్రి పల్లె

 


హైదరాబాద్: రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన కార్యాలయాల కోసం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు భవనాలను పరిశీలించినప్పటికీ తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. కార్యాలయాలను ఒక్కసారిగా తరలించడం కాదన్న ఉద్దేశంతో కీలకమైన విభాగాలను దశలవారిగా తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆయా శాఖలను తరలించడంపై ఇప్పటికే పలు కమిటీలు వేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయిదుగురు ఐఏఎస్ అధికారులతో మరో కమిటీని నియమించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని విజయవాడ, గుంటూరులకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడానికి వీలుగా తాత్కాలిక ఏర్పాట్లను చేయడానికి ఈ కమిటీని నియమించింది. పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్ (ఇన్‌చార్జ్ కార్యదర్శి) మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప, రహదారులు, భవనాలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంబాబ్‌లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే సీఆర్‌డీఏ పరిధిలోకి తరలించడానికి వీలుగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లను చేయాలని కమిటీని ఆదేశించింది. తాత్కాలికంగా కార్యాలయాలను ఏర్పాటు చేయ డం కోసం భవనాలను కమిటీ పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భవనాల ఎంపికలో ఈ కమిటీకి కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహకరించాలని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  



విజయవాడ నుంచే పరిపాలన: పల్లె

విజయవాడ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలను దశలవారీగా అక్కడికి తరలిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. సవాళ్లను అవకాశంగా మలచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మించడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించిందన్నారు. రాజధాని నగరం నిర్మించేలోగా.. విజయవాడ నుంచి తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తామని చెప్పారు. వీలైనంత తొందరగా విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి తాత్కాలిక భవనాల ఎంపిక కోసమే ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వగానే దశల వారీగా కార్యాలయాలను తరలించి పరిపాలన సాగిస్తామని తెలిపారు.  

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top