‘స్టీల్‌ సిటీని స్టోలెన్‌ సిటీగా మార్చారు’

‘స్టీల్‌ సిటీని స్టోలెన్‌ సిటీగా మార్చారు’ - Sakshi


విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కనుసన్నల్లోనే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖపట్నంలో రూ. 2 నుంచి 3 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... లక్ష ఎకరాలు టీడీపీ నాయకులు ఆక్రమించారని అన్నారు. భూ కబ్జాలతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందని, టీడీపీలో అధికారంలోకి వచ్చాక దోపిడీకి గురైన నగరంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ సిటీని స్టోలెన్‌ సిటీగా మార్చారని వాపోయారు. విశాఖలో జరిగింది పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ కాదు, అది సెటిల్‌మెంట్‌ సమ్మిట్‌.. కబ్జాల సమ్మిట్‌ అని వ్యాఖ్యానించారు.



భూ కబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్నారు. తూతూ మంత్రంగా సిట్‌ దర్యాప్తు జరుగుతోందని, దీనివల్ల ఫలితం ఉండదని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నప్పుడు సర్కారు నియమించిన సిట్‌ విచారణ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిపితేనే దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.



భూముల అక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బావమరిది భాస్కరరావు, గంటా అల్లుడు ప్రశాంత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పీలా గోవింద్‌, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, అనిత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి ప్రమేయముందని ఆరోపించారు. టీడీపీ నాయకుల భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. చట్టవ్యతిరేకంగా భూములు కొల్లగొట్టినవారిని వదిలిపెట్టబోమని, 2019 తర్వాత వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అన్యాయంగా ఆక్రమించుకున్న భూములను వెనక్కు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావును చట్టవ్యతిరేకంగా తొలగించారని ఆయన అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top