ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి - Sakshi

  • రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌

  • ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి

  • మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి

  • సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ప్రత్యేక హోదాను మంజూరు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమ యం లో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, ఇతర హామీల ప్రస్తావన రాష్ట్రçపతి ప్రసంగంలో లేనందువల్ల తాను ధన్యవాద తీర్మానానికి కొన్ని సవరణలను ప్రతిపాదించానని చెప్పారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.



    పన్నుల్లో వాటానే ప్యాకేజీగా...

    ప్రత్యేక హోదా సిఫార్సు చేయలేదని, భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయవద్దని 14 వ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడ ఉందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పైగా ఆర్థిక సంఘం నివేదిక కేవలం సిఫార్సు మాత్రమేనని, తప్పనిసరి కాదని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం అమలు కాకపోతే చట్టపరమైన సహాయం ఏమిటని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజిని రాష్ట్రంలో ఎవరు కోరారని ప్రశ్నించారు. రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటాను ప్యాకేజిగా చెబుతున్నారని తెలిపారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను అధికారంలో ఉన్న పార్టీలు అదునుగా తీసుకుంటున్నాయని చెప్పారు. అనర్హత పిటీషన్లపై నియమిత కాలవ్యవధిలో స్పీకర్లు నిర్ణయం తీసుకునే విధంగా ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని సూచించారు. మహిళల సాధికారత కోసం చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top