Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

‘జై ఆంధ్రా’ నుంచి.. ‘ఉప రాష్ట్రపతి’ వరకు!

Sakshi | Updated: July 18, 2017 08:02 (IST)


(ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ప్రకటించిన సందర్భంగా సోమవారం ఢిల్లీలోని నివాసంలో ఆయనకు స్వీట్లు తినిపిస్తున్న భార్య ఉష, కుటుంబ సభ్యులు)

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. నమ్మిన భావజాలంపై మొక్కవోని అంకిత భావం.. తెలుగు, ఇంగ్లిష్, హిందీలో ప్రాసలతో మాట్లాడుతూ ప్రత్యర్థులను హడలెత్తించే గుక్కతిప్పుకోని చమత్కార వాగ్ధాటి.. వెరసి ముప్పవరపు వెంకయ్య నాయుడు! ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన 68 ఏళ్ల వెంకయ్య గెలుపోటముల మధ్య తడబడకుండా నిలకడతో, దృఢచిత్తంతో రాజకీయాల్లో రాణించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం వరకు సాగిన ఆయన ప్రస్థానమిదీ..

వెంకయ్య విద్యార్థి దశలో ఆరెస్సెస్‌లో కొన్నాళ్లు పనిచేశాక ఏబీవీపీలో ప్రవేశించారు.1972–73 జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన వాగ్ధాటి అందరినీ ఆకట్టు కుంది. ఎమర్జెన్సీ సమయంలో కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపిన ఆయన తర్వాత అరెస్టయి విశాఖ జైల్లో ఉన్నారు. లా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌  స్పూర్తితో ఆవిర్భవించిన ఛాత్ర సంఘర్ష సమితి ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షునిగా ఎన్నిక య్యారు. తర్వాత జనతా పార్టీ యువజన విభాగం యువజనత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.

1978లో అసెంబ్లీకి..
ఎమర్జెన్సీ నిర్బంధం నుంచి విడుదలయ్యాక వెంకయ్య తొలిసారి 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను పులి వెంకటరెడ్డి(కాంగ్రెస్‌) 80 వేల ఓట్ల తేడాతో ఓడించారు. తర్వాత వెంకయ్య 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం ఉదయగిరి నుంచి జనతా టికెట్‌పై గెలిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 20వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నియోజకవర్గం ఆత్మకూరులో పోటీచేసి ఓడారు. తర్వాత లోక్‌సభకు రెండుసార్లు పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు. 1989లో బాపట్ల నుంచి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆరేళ్లవరకూ ఎన్నికల జోలికిపోని వెంకయ్య 1996 ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఎంఐఎం సిటింగ్‌ ఎంపీ సుల్తాన్‌ సలాహుద్దీన్‌ ఒవైసీ చేతిలో 70 వేలకుపైగా ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీచేయలేదు.

కర్ణాటక నుంచి పెద్దల సభకు..
కర్ణాటకలో తమ బలం పెరగడంతో బీజేపీ వెంకయ్యను అక్కడి నుంచి రాజ్యసభకు పంపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రతినిధి పదవులు సమర్థంగా నిర్వహించడంతోపాటు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు వెంకయ్యకు కలసి వచ్చాయి. వరుసగా 1998, 2004, 2010లో కర్ణాటక నుంచే మూడుసార్లు ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999–2002 మధ్య వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా, 2002–2004 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, తర్వాత ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. 2014లో మోదీ తొలి కేబినెట్‌లో చేరిన వెంకయ్య రాజ్యసభ మూడో పదవీకాలం కిందటేడాది ముగిసింది. అయితే ఆయనను నాలుగోసారి తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి కర్ణాటక బీజేపీ నేతల్లో కొందరు ససేమిరా అన్నారు. దీంతో 18 ఏళ్ల తర్వాత ఆయనకు కన్నడ ప్రాంతలో చుక్కెదురైంది. అయినప్పటికీ ఆయన పనితీరుపై మోదీకి ఉన్న నమ్మకం, అధిష్టానం వద్ద పలుకుబడి కారణంగా 2016 రాజ్యసభ ఎన్నికల్లో రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగలిగారు. అయితే సొంత రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రవేశించలేకపోవడం వెంకయ్య విజయాలపై క్రీనీడలాంటిదే. వెంకయ్య, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్‌ సిటీల పథకం, రియల్‌ ఎస్టేట్‌ చట్టం వంటి కీలక పథకాలు, చట్టాలు సాకారం అయ్యాయి.

‘ఉషాపతి’గానే ఉంటాను..
మూడు భాషల్లో అనర్గళ వా గ్ధాటి, వాజ్‌పేయి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేయ డం జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నిలదొ క్కుకోవడానికి ఉపకరించింది బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ వర్గీయుడిగా ముద్ర ఉన్నా, 2013 నాటి బీజేపీ అంత ర్గతపోరులో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి మోదీకి మద్దతివ్వడం వెంకయ్యకు కలిసొచ్చింది. ప్రభుత్వంలో ‘ట్రబుల్‌ షూటర్‌’గా పేరొందిన ఆయనకు 2014 మళ్లీ కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖలు దక్కాయి. ఒక దశలో రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉందనే వార్తలూ వినిపించాయి. దీనిపై ఆయన చమత్కారంగా స్పందిస్తూ.. తనకు ‘ఉషాపతి’గానే ఉండటం ఇష్టమమని భార్య పేరును ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి పదవి గురించి ప్రస్తావించగా, ‘ప్రజల మధ్య ఉండడమే నాకిష్టం. అలం కార ప్రాయమైన ఉపరాష్ట్రపతి పదవిపై ఆశ లేదు’ అని అన్నారు.

వెంకయ్య జీవిత విశేషాలు..
పేరు: ముప్పవరపు వెంకయ్య నాయుడు
పుట్టిన తేదీ:    01.07.1949
పుట్టిన ఊరు: చవటపాలెం, ఉదయగిరి తాలూకా, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా
తల్లి: రమణమ్మ
తండ్రి: రంగయ్య నాయుడు
భార్య: ముప్పవరపు ఉష
వివాహం: 1971 ఏప్రిల్‌ 14
విద్యార్హతలు:     బి.ఎ., బి.ఎల్‌.
పిల్లలు: కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్‌
వృత్తి: రాజకీయ నేత, సామాజిక కార్యకర్త, రైతు

చేపట్టిన పదవులు
1971:నెల్లూరు వి.ఆర్‌.కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు
1973–74: ఏయూ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు
1974: లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌నారాయణ్‌ విద్యార్థి సంఘర్‌‡్ష సమితి కన్వీనర్, ఏపీ
1977–80: జనతా పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు, ఏపీ
1978–83, 1983–85: ఎమ్మెల్యే, ఏపీ
1980–83: ఆల్‌ ఇండియా బీజేపీ యువజన విభాగ ఉపాధ్యక్షుడు
1980–85: బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ, ఏపీ
1985–88: ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి
1988–93: ఏపీ బీజేపీ అధ్యక్షుడు
1993–2000: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
1996–2000: బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శి, బీజేపీ అధికార ప్రతినిధి
1998 ఏప్రిల్‌: రాజ్యసభకు ఎన్నిక(కర్ణాటక నుంచి)
2000 సెప్టెంబర్‌–2002 జూన్‌: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి
2002 జూలై–2004 అక్టోబర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
2004 జూన్‌: రాజ్యసభకు రెండోసారి ఎన్నిక(కర్ణాటక నుంచి)
2006–08: పిటిషన్ల కమిటీ చైర్మన్‌(రాజ్యసభ)
2006 నుంచి ఇప్పటివరకు: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు
2010 జూన్‌: మూడోసారి రాజ్యసభకు ఎన్నిక(కర్ణాటక నుంచి)
2014 మే 26– 2016 జులై 6: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
2016 మే: నాలుగో సారి రాజ్యసభకు ఎన్నిక(రాజస్తాన్‌ నుంచి)
2016 జూలై 6 నుంచి ఇప్పటి వరకు: పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రి
జైలు జీవితం: ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయి జైలు జీవితం గడిపారు
సామాజిక సేవ: స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవా కార్యక్రమాలు
పర్యటించిన దేశాలు: అమెరికా, యూకే, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, మారిషస్, మాల్దీవులు, దుబాయ్, హాంకాంగ్, థాయ్‌లాండ్, స్పెయిన్, ఈజిప్ట్, జర్మనీ    – సాక్షి, న్యూఢిల్లీ

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌, సాక్షి- న్యూఢిల్లీ
వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC