భారత్‌పై ఎలాంటి నిఘాను ఒప్పుకోం

భారత్‌పై ఎలాంటి నిఘాను ఒప్పుకోం


న్యూఢిల్లీ: భారత్‌లో రాజకీయ నేతలపైన, ఇతర సంస్థలపైన ఎలాంటి నిఘా అయినా తమకు ఆమోదయోగ్యం కాదని ప్రభుత్వం గురువారం అమెరికాకు నిర్మొహమాటంగా తేల్చిచెప్పింది. కాగా, ఎలాంటి విభేదాలున్నా పరిష్కరించుకోవచ్చని అమెరికా ప్రతిస్పందించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో,  అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఢిల్లీలో దాదాపు గంటసేపు జరిగిన వ్యూహాత్మక చర్చల్లో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉభయ నేతలమధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో అమెరికా నిఘా వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమెరికాతో ఈ అధికారిక చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం తదితర కీలక అంశాలు ఈ చర్చల్లో విస్తృతంగా ప్రస్తావనకు వచ్చాయి.  అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్‌తోపాటు, జాన్ కెర్రీ మాట్లాడారు.

 

 బీజేపీ నేతల కార్యకలాపాలపై అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) నిఘా పెట్టిన ట్టు వచ్చిన వార్తలను కెర్రీతో ప్రస్తావించానని సుష్మా చెప్పారు. ఉభయదేశాలు తమను పరస్పరం మిత్రదేశాలుగా పరిగణించుకోవాలని, ఒక మిత్రదేశం మరో మిత్రదేశంపై నిఘాపెట్టడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని తాను స్పష్టంచేశానని సుష్మా స్వరాజ్ చెప్పారు. అయితే అమెరికా నిఘా వ్యవహారాన్ని కెర్రీ సమర్థిస్తున్న ధోరణిలో మాట్లాడారు. భారత్‌తో సంబంధాలను విలువైన విగా పరిగణిస్తామని, ఉమ్మడి సమస్యలను రెండు దేశాల నిఘా విభాగాల సహాయంతో పరిష్కరించుకుంటామన్నారు.

 

 మోడీకి ఘనస్వాగతం పలుకుతాం: కెర్రీ

 

 వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబాతో వాషింగ్టన్‌లో ప్రధాని మోడీ జరపబోయే సమావేశం కోసం తాము ఎదురుచూస్తున్నామని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కెర్రీ చెప్పారు. గుజరాత్ అల్లర్ల అనంతరం, 2005లో నరేంద్ర మోడీకి అప్పటి ప్రభుత్వం వీసా నిరాకరించారని, ఇప్పుడు తాము మోడీకి ఘన స్వాగతం పలుకుతామన్నారు. అణు సరఫరా గ్రూప్‌లో చోటు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అంశాలపై భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్‌దోవల్‌తో కెర్రీ సమావేశమయ్యారు. జెనీవాలో జరిగే ప్రపంచ వాణిజ్య ఒప్పందం చర్చల లపై భారత్ వైఖరిని ఆయన ప్రస్తావించారు. వాణిజ్యమనేది ఆహార భధ్రతతో ముడిపడి ఉండాలన్న తన వైఖరిని భారత్ పునరుద్ధాటించింది. గతేడాది బాలిలో జరిగిన డబ్ల్యుటీవో ఒప్పందాన్ని ఆమోదించేది లేదని భారత్ లోగడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, దక్షిణ ఢిల్లీలోని ఐఐటీని కెర్రీ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

 

 ముంబై దాడుల కుట్రదారులను చట్టానికి పట్టించాలి

 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించిన కుట్రదారులను చట్టానికి అప్పగించే దిశగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికా గురువారం డిమాండ్ చేశాయి. ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడానికి, లష్కరే తోయిబా, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి గట్టిగా కృషిచేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీల మధ్య చర్చల అనంతరం ఉభయ నేతలు ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటనను వెలువరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top