'ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటే మంచిది'

'ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటే మంచిది' - Sakshi


కోయంబత్తూర్: ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణ సాకుతో వ్యక్తిత్వాన్ని హత్య చేస్తోందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ మండిపడ్డారు. ముందు ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి రాహుల్ తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పై ఏమైనా సందేహాలుంటే ఒకసారి ఆ సంస్థ శాఖలను సంప్రదిస్తే రాహుల్ కు అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు.


 


శుక్రవారం ఇక్కడకు ఓ వివాహ కార్యక్రమానికి వచ్చిన రాధాకృష్ణన్.. పార్లమెంట్ సమావేశాలకు అధికశాతంలో డుమ్మా కొట్టే రాహుల్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే ఎటువంటి అర్హతలు రాహుల్ కు లేవన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ పనిచేస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలను కూడా రాధాకృష్ణన్ తప్పుబట్టారు. దేశంలో రైతులు నుంచి దుస్తుల వరకూ ప్రతీ విషయం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ప్రధాని నరేంద్ర మోదీయేనని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ నుంచి మోదీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదన్నారు. దేశం అభివృద్ధిలో భాగంగా పలు పథకాల అమలుపై చర్చించేందుకు మాత్రమే మన్మోహన్ తో మోదీ భేటీ అయి ఉంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top