‘నాసా’ లోపాన్ని పసిగట్టిన విద్యార్థి

‘నాసా’  లోపాన్ని పసిగట్టిన విద్యార్థి


లండన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(ఐఎస్‌ఎస్‌) నాసా నమోదు చేసిన డేటాలో లోపాన్ని పసిగట్టిన ఓ బ్రిటన్‌ విద్యార్థి ప్రశంసలందుకున్నాడు. సమస్యను విశ్లేషించడానికి తమతో కలసి పాల్గొనాలని నాసా నుంచి ఆహ్వానం అందుకున్నాడు. షెఫిల్డ్‌లోని టాప్టన్‌ స్కూల్‌లో చదువుతున్న మైల్స్‌ సొలొమెన్‌(17) ఐఎస్‌ఎస్‌లోని రేడియేషన్‌ సెన్సర్లు తప్పుడు డేటాను పంపుతున్నట్లు గుర్తించి నాసాకు ఫిర్యాదు చేశారు.



తన ప్రాజెక్టులో భాగంగా నాసా యూకేలోని విద్యార్థులకు ఈ డేటాను అందించింది. అందులో అసాధారణమైన వివరాలేమైనా ఉంటే తెలపాలని కోరింది. సొలొమెన్‌ బీబీసీతో మాట్లాడుతూ ‘నేను డేటాను గమనించినప్పుడు ఐఎస్‌ఎస్‌లోని కొన్ని సెన్సర్లు మైనస్‌ 1 డిగ్రీగా నమోదు చేసినట్లు ఉంది. ఎటువంటి రేడియేషన్‌ లేనప్పుడు రీడింగ్‌ రుణాత్మకంగా రావడాన్ని గుర్తించాను’ అని తెలిపారు.



వాస్తవానికి రుణాత్మక రీడింగ్‌ అన్నది అసలు ఉండకూడదు. వెంటనే తన ఫిజిక్స్‌ టీచర్‌ జేమ్స్‌ ఓ నైల్‌ సాయంతో సొలొమెన్‌ నాసాకు ఈ–మెయిల్‌ పంపారు. ఈ లోపం గురించి తమకు ముందే తెలుసనీ, ఇలా ఏడాదికి ఒకట్రెండు సార్లు జరుగుతుంటుందని నాసా పేర్కొంది. మరోవైపు ఇలా రోజులో చాలాసార్లు రుణాత్మక రీడింగ్‌ నమోదు కావడం తాను గుర్తించినట్లు సొలొమెన్‌ చెప్పడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top