స్కూల్లో కురచ స్కర్టులపై నిషేధం

స్కూల్లో కురచ స్కర్టులపై నిషేధం


ఇంగ్లండ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో అమ్మాయిలు కురచగా ఉండే స్కర్టులు వేసుకు రావద్దంటూ ఆ స్కూలు ప్రధానోపాధ్యాయిని నిషేధం విధించారు. ఆ స్కూల్లో అమ్మాయిలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాళ్లు తెగ చూపిస్తున్నారని, వాళ్లు వేసుకొచ్చే స్కర్టులు అసలు సరిగా కప్పి ఉంచలేకపోతున్నాయని ట్రెంథమ్ హైస్కూలు హెచ్ఎం రొవెనా బ్లెన్కొవ్ అన్నారు. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అక్కడి అమ్మాయిలందరూ తప్పనిసరిగా ప్యాంట్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. గడిచిన రెండేళ్ల నుంచి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా 9, 10, 11 క్లాసుల్లో చదివే అమ్మాయిలతోనే ఈ సమస్య అన్నారు. 7, మహా అయితే 8వ తరగతి వరకు అమ్మాయిలు నిబంధనలకు లోబడి ఉంటారని, కానీ వాళ్లు పెద్దయ్యే కొద్దీ స్కర్టులు మాత్రం పొట్టివైపోతున్నాయని ఆమె వాపోయారు.



ఇప్పుడు అమ్మాయిలు వేసుకొస్తున్న స్కర్టులు అసలు వాళ్లకు ఏమాత్రం సరిపోయేలా ఉండట్లేదని తెలిపారు. ఇలా పొట్టి స్కర్టులు వేసుకొచ్చే అమ్మాయిలను ముందుగా హెచ్చరిస్తున్నామని, అయినా వాళ్లు మాత్రం ఆ పని మానట్లేదని హెడ్ మిస్ట్రెస్ చెప్పారు. కొంతమంది విద్యార్థినుల విషయంలో అయితే తల్లిదండ్రులను పిలిపించి, వాళ్లను ఇళ్లకు పంపేశామని చెప్పారు. కొంతమంది అమ్మాయిలకు తానే స్వయంగా కొత్త స్కర్టులు కొనిచ్చానని.. స్కూల్లో ఇలాంటి వాతావరణం ఉండకూడదని ఆమె అన్నారు. స్కూల్లో ఉండే అబ్బాయిలు, మగ టీచర్లు అందరికీ ఇది ఇబ్బందేనని, వాళ్ల దృష్టి మళ్లుతుందని ప్రధానోపాధ్యాయిని వ్యాఖ్యానించారు. ఇది యూనిఫాం సమస్య కావడం మానేసి.. పిల్లలను కాపాడుకునే సమస్య అవుతుందన్నారు. ఇంతకుముందు కూడా హెర్ట్ఫోర్డ్షైర్ ప్రాంతంలోని సెయింట్ మార్గరెట్స్ స్కూల్లో కూడా అమ్మాయిలు పొట్టి స్కర్టులు వేసుకు రాకూడదని, అతిగా మేకప్ చేసుకుని రాకూడదని నిషేధం విధించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top