జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి

జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి - Sakshi


నిరసనలో మరొకరు

తమిళనాడులో తిరిగి ప్రారంభమైన జల్లికట్టు

►  సీఎంకు నిరసనల సెగ.. ఆలంగానల్లూరులో ఆట ప్రారంభించకుండా చెన్నైకి వెళ్లిపోయిన సెల్వం


సాక్షి, చెన్నై/మదురై: తమిళనాడు ప్రజల సంప్రదాయ క్రీడ జల్లికట్టు ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పుదుకోట్టై జిల్లా రాపూసల్‌లో ఒక ఎద్దు పొడవడంతో ఇద్దరు చనిపోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మోహన్ , రాజా అనే వ్యక్తులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఆటకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. మరోపక్క ఆట నిర్వహణకు శాశ్వత పరిష్కారం కావాలంటూ మదురైలో జరిగిన నిరసనలో పాల్గొన్న చంద్రమోహన్ (48) అనే వ్యక్తి డీహైడ్రేషన్ కు గురై చనిపోయాడు.


నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డి నెన్స్‌ తీసుకురావడం తెలిసిందే. జల్లికట్టుకు ప్రసిద్ధికెక్కిన మదురై జిల్లా అలంగానల్లూరులో ఆదివారం ఆటను ప్రారంభించేందుకు మొదట మదురైకి వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వానికి నిరసనల సెగ సోకింది. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేంతవరకు ఆటను జరగనివ్వబోమని అలంగానల్లూరులోని నిరసనకారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన కాసేపు మదురై హోటల్లోనే ఉండిపోయారు. అలంగానల్లూరులో కాకుం డా దిండిగల్‌ జిల్లా నాతం కోవిల్పట్టిలో ఆయన ఆటను ప్రారంభిస్తారని భావించారు.


అయితే అక్కడా నిరసనలు జరగడంతో సీఎం తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్  ఆట నిర్వహణకు శాశ్వత పరిష్కారం. ఆటపై నిషేధం పూర్తిగా తొలగిపోయింది. సోమవారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ ను చట్టంగా మారుస్తాం. అలంగానల్లూరులోని స్థానికులు నిర్ణయించిన రోజున అక్కడ ఆట జరుగుతుంది’ అని సీఎం చెప్పారు. జల్లికట్టును ప్రారంభించేందుకు జిల్లాలకు వెళ్లిన పలువురు మంత్రులు కూడా ప్రజల నిరసనతో వెనుదిరిగారు. ఆర్డినెన్స్ కు ఆటంకాలూ ఎదురవకుండా సుప్రీంకోర్టులో రాష్ట్ర ›ప్రభుత్వం కేవియేట్‌ పిటిషన్  దాఖలు చేసింది.



శాశ్వత పరిష్కారం కావాల్సిందే..

జల్లికట్టు నిర్వహణకు అన్ని అడ్డంకులూ తొలగిస్తూ శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిందేనని ఆట మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కావాలంటూ చెన్నై మెరీనా బీచ్‌లో ఆదివారం ఆరో రోజూ నిరసన కొనసాగించారు. ఆర్డినెన్స్  నేపథ్యంలో ఆందోళనను మార్చి 31వరకు వాయిదా వేద్దామని జల్లికట్టు ఉద్యమ నేతల్లో కొందరు పిలుపుచ్చారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని యువత, విద్యార్థులు చెప్పారు.  



కంబళను నిర్వహించి తీరతాం

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ చిత్తడి పొలాల్లో దున్నపోతుల పందేన్ని(కంబళ) ఈ నెల 28న మంగళూరులో నిర్వహించి తీరతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని కంబళ కమిటీ అధ్యక్షుడు అశోక్‌ రాయ్‌ అ న్నారు. పెటా పిటిషన్ పై హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కంబళపై స్టే విధించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top