వారి మరణశిక్షకు అంతా సిద్ధం

వారి మరణశిక్షకు అంతా సిద్ధం


ఆస్ట్రేలియా పౌరులు ఆండ్రీ చాన్, మైయూరన్ సుకుమారన్‌లకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. వారి మరణశిక్ష అమలుకు శనివారమే 72 గంటల నోటీసు కూడా అందజేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు మరణశిక్ష అమలుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు శవపేటికలు సిద్ధం చేశారు. వాటిపై చనిపోయిన రోజును తెలిపేలా '29-4-2015'  అన్న తేదీలను లిఖించారు. వారిని కాల్చి చంపేందుకు 12 మందితో కూడిన షూటింగ్ స్క్వాడ్‌ను కూడా సిద్ధం చేసినట్టు బాలి జైలు అంత్యక్రియల డైరెక్టర్ సుహేంద్ర పుత్ర తెలిపారు. వారికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్‌లతోపాటు పలు దేశాలు చేసిన విజ్ఞప్తులను ఇండోనేషియా తోసిపుచ్చింది. ఆ శాధ్యక్షుడు విడోడో మౌనం వహించారు.



ఇండోనేషియాలోని బాలి నగరం నుంచి ఆస్ట్రేలియాకు మత్తు పదార్థాలు తరలిస్తూ ఆండ్రీ చాన్, మైయూరన్ సుకుమారన్‌ పట్టుపడ్డారు. వారితో పాటు ఓ బ్రెజిల్ దేశస్థుడు రోడ్రిగో గులార్టే, నైజీరియా దేశస్థుడు అయోటాంజ్, ఫిలిప్పీన్స్ దేశస్థుడు ఫీస్టా వెలిగోలను అరెస్టు చేశారు. వారందరికీ ఇండోనేషియా కోర్టు 2005లోనే మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు ఈ కేసులో పలు అప్పీళ్లపై విచారణ కొనసాగింది. చివరకు ఇండోనేషియా సుప్రీం జ్యూరీ వారికి మరణశిక్షనే ఖరారు చేసింది. నిందితులందరూ ఈ పదేళ్లు జైలులోనే గడిపారు. ఈ కాలంలో వారెంగో మారారు. వారు తోటి ఖైదీలను సాయం చేశారు. జైలు తరఫున సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము ఎంతో మారామని, శేష జీవితాన్ని బుద్ధిగా గడుపుతామని, తమను తమ దేశాలకు పంపించాలని వారు కోర్టుల ముందు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు.



భారీగా జరిమానా కడితే 20 ఏళ్ల జైలు శిక్షతో సరిపెడతామని జడ్జీలు కూడా ఆశపెట్టారు. అంత డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేని వారి కుటుంబ సభ్యులు తమ దేశాధినేతలను ఆశ్రయించారు. దాంతో ప్రపంచం ముందు తమ పరువు పోతుందని భావించిన ఇండోనేషియా ప్రభుత్వం చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూప్రీం జ్యూరీని ఆదేశించింది. దాంతో వారు మరణశిక్ష వైపే మొగ్గు చూపారు. ఆస్ట్రేలియా పౌరులతోపాటు పట్టుబడ్డ ఇతర దేశస్థులకు  కూడా బుధవారం తెల్లవారు జామునే మరణ శిక్ష అమలు చేస్తున్నారు. ఆండ్రీ చాన్, సుకుమారన్‌ల ఇంటర్వ్యూలను పలు ఆస్ట్రేలియా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దోషుల ఆఖరి కోరికలు తీర్చేందుకు జైలు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జైలులో పెయింటింగ్‌లు వేస్తూ పాపులర్ అయిన సుకుమారన్, తాను తుదిశ్వాస విడిచేవరకు పెయింటింగ్‌లు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తుపాకీ తూటా తగిలి తాను నేలకొరిగిపోతున్న 'సెల్ఫ్ ప్రోట్రేట్స్' వేసుకున్నాడు. చివరివరకు తన కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని ఆండ్రీచాన్ ఆఖరి కోరిక కోరాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top