ప్చ్‌.. సినిమా నిరాశ పరిచేలా ఉంది!

ప్చ్‌.. సినిమా నిరాశ పరిచేలా ఉంది!


'బజరంగీ భాయ్‌జాన్‌', 'సుల్తాన్‌' వంటి భారీ విజయాల తర్వాత బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ నటించిన తాజాచిత్రం 'ట్యూబ్‌లైట్‌'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు లేదనే టాక్‌ వినిపిస్తోంది. విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరుస్తుండగా.. పెద్దగా ఆకట్టుకునేవిధంగా లేకపోవడం మైనస్‌ పాయింట్‌ అని సినీ జనాలు అంటున్నారు. మొత్తానికి ఎన్నో అంచనాలతో వచ్చిన 'ట్యూబ్‌లైట్‌' సినిమాపై సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. 'ట్యూబ్‌లైట్‌' నిరాశపరిచేవిధంగా ఉందని ప్రముఖ బాలీవుడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. సల్మాన్‌ ఖాన్‌లాంటి సాలిడ్‌ స్టార్‌ పవర్‌, స్టన్నింగ్‌ విజువల్స్‌ ఈ సినిమాలో ఉన్నాయని, ఈ సినిమా నిర్మాణం అందంగా ఉన్నా.. ఆత్మ లోపించిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



సల్మాన్‌ ఖాన్‌తో 'ఏక్‌ థా టైగర్‌', 'బజరంగీ భాయ్‌జాన్‌' వంటి భారీ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తాజా చిత్రం 'ట్యూబ్‌లైట్‌' యుద్ధనేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. హాలీవుడ్‌ సినిమా 'లిటిల్‌ బాయ్‌' ప్రేరణతో తెరకెక్కిన ఈ సినిమాలో బుద్ధిమాంద్యం కలిగిన లక్ష్మణ్‌ సింగ్‌ బిష్త్‌ పాత్రలో సల్మాన్‌ నటించాడు. ఈశాన్య భారతంలోని జగత్‌పూర్‌ కేంద్రంగా సాగే ఈ సినిమాలో వయస్సు పెరిగినా బాలుడిలా వ్యవహరించే సల్మాన్‌ను చుట్టుపక్కల వారు 'ట్యూబ్‌లైట్‌' అంటూ ఆటపటిస్తుంటారు. ఏడిపిస్తుంటారు. ఈ క్రమంలోనే చైనీయులైన లిలింగ్‌, పెర్కీ గౌ అక్కడికి జీవించడానికి వలసరావడం.. అనంతరం భారత్‌-చైనా యుద్ధం జరగడం కథలో భాగంగా వస్తాయి. యుద్ధం కన్నా మానవ సంబంధాలు, కుటుంబబాంధవ్యాలు గొప్పవని చాటుతూ సాగే ఈ సినిమాలో సందేశం బాగానే ఉన్నా.. బలమైన స్కిప్ట్‌ లేకపోవడంతో సినిమా తేలిపోయిందనే భావనను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్‌ వంటి భారీ యాక్షన్‌ మాస్‌ మసాల తర్వాత పిల్లాడి మనస్తత్వమున్న పాత్రలో సల్మాన్‌ నటించడం అభిమానులకు రుచించకపోవచ్చునని వినిపిస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top