కొంపముంచనున్న ట్రంప్‌ వలస విధానం

కొంపముంచనున్న  ట్రంప్‌ వలస విధానం - Sakshi


మూడు లక్షల మంది వెనక్కి!

భారతీయులపై ట్రంప్‌ వలస ప్రణాళికల ప్రభావం

మొత్తమ్మీద 1.1 కోట్ల మందిని అమెరికా నుంచి పంపే అవకాశం




వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశముంది. వీరిని దేశం నుంచి పంపించేందుకు ఫెడరల్‌ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. ‘పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికీ ఇక ఎంతమాత్రం మినహాయింపు ఉండదు’ అని అంతర్గత భద్రత విభాగం(డీహెచ్‌ఎస్‌) తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానమున్న ఏ విదేశీయుడినైనా అరెస్ట్‌ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి ఈ విభాగ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని పేర్కొంది. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు డీహెచ్‌ఎస్‌ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. నేరచరిత ఉన్న విదేశీయులపై ప్రధానంగా దృష్టి సారించినా, ఇతరులను కూడా లక్ష్యం చేసుకున్నారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అనధికారిక అంచనా. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. అధికారిక పత్రాలు లేని వలసదారులపై, ప్రవేశ అర్హత లేదని తేలడానికి ముందు రెండేళ్లపాటు అమెరికాలో ఉండని వారిపై తక్షణ తొలగింపు నిబంధనలను అమలు చేయడానికి డీహెచ్‌ఎస్‌ సెక్రటరీకి అధికారం ఉంటుంది.


అయితే ఒంటరి మైనర్లకు, ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు, చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ధ వలస హోదా ఉందని చెప్పేవారికి మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరని ఉత్తర్వులో పేర్కొన్నారు. వారిని తక్షణం సొంత దేశాలకు అప్పగించడం వల్ల, జైళ్లు, న్యాయవ్యవస్థల వనరులను పొదుపు చేసుకుని ఇతర ప్రాధాన్య విదేశీయులకు కేటాయించడానికి వీలవుతుందని తెలిపారు.



భారీ తరలింపులు ఉండవు: వైట్‌హౌస్‌

కొత్త మార్గదర్శకాల వల్ల విదేశీయులను భారీసంఖ్యలో పంపబోరని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత చట్టాలను అమలు చేయడానికి అధికారులకు అధికారాలివ్వడానికే వీటిని తెచ్చినట్లు వెల్లడించారు.  



వారిపై తీసుకునే చర్యలివీ..

అక్రమ వలసదారులపై పలు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డీహెచ్‌ఎస్‌ పత్రాల్లో పేర్కొన్నారు. వారి నేరాలను బయటపెట్టడం, గోప్యత హక్కుల రద్దు, వారిపై చర్యలు తీసుకోవడానికి స్థానిక పోలీసులకు అధికారాలు, కొత్త జైళ్ల నిర్మాణం, ఆశ్రయం కోరేవారిని నిరుత్సాహపరచడం వంటివి ఇందులో ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, షాపుల్లో దొంగతనాలు చేసిన వారిని కూడా తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినవారితో సమానంగా పరిగణిస్తారని పేర్కొంది.



            మంగళవారం న్యూయార్క్‌లోని లిబర్టీ విగ్రహం వద్ద దర్శనమిచ్చిన ‘శరణార్థులకు స్వాగతం’ బ్యానర్‌


 


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top