బీజేపీ యూటర్న్ ను ప్రశ్నించిన తృణమూల్


కోల్ కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ సర్కారు వెనక్కి తగ్గడాన్ని ప్రశ్నించింది. నల్లధనం వ్యవహారానికి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం నిజంగా బాధాకరమని తృణమూల్ రాజ్యసభ అభ్యర్థి ఓబ్రెయన్ విమర్శించారు. దేశంలోని అవినీతి కారణంగానే కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీచాయని ఆయన తెలిపారు.


 


ఇదే తరహాలో బీజేపీ కూడా వ్యవహరించడం రెండు పార్టీలు దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.' నల్లధనంపై చేపట్టే చర్యలు ఏమిటి? దీనిపై ఉపయోగంలేని కమిటీ ఏర్పాటు ఒక్కటే చాలదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తృణమూల్ సిద్ధంగా ఉందని తెలిపారు.


 


భారత్‌తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని శుక్రవారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని,  ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. దీనిపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది.నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టిందని అభిప్రాయపడింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top