వైరల్‌ వీడియో: ఆ చిన్నారి మొండిది.. అందుకే

వైరల్‌ వీడియో: ఆ చిన్నారి మొండిది.. అందుకే


న్యూఢిల్లీ: చదువు పేరిట చిన్నారిని భయపెట్టి, బెదిరించి వేధిస్తున్న వీడియోను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి కలత చెందిన క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, శిఖర్‌ ధావన్‌తోపాటు ఎంతోమంది నెటిజన్లు షేర్‌ చేసుకున్నారు. పిల్లలను చదువు పేరిట ఇలా దండించడం, హింసించడం ఎంతమాత్రం సరికాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను చక్కగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, చిన్నారి హృదయాలను ఇలా బెదిరించి, హింసించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.



అయితే, ఆసక్తికరంగా ఈ వీడియోలో ఉన్న చిన్నారి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌ గాయకులు తోషి, షరీబ్‌ సబ్రీల మేనకోడలే ఈ మూడేళ్ల పాప హయా.. వైరల్‌ అయిన ఈ వీడియోపై గాయకుడు తోషీ సబ్రీ స్పందిస్తూ.. హయా చాలా మొండిదని, ఎంత చెప్పినా చదువుకోదని, అందుకే ఆమె తల్లి ఇలా బలవంతంగా నేర్పిస్తున్నదని వివరించాడు. తమ కుటుంబానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ కోసం ఈ వీడియోను హయా తల్లే రికార్డు చేసిందని, ఇది అందరూ షేర్‌ చేసుకోవడానికి కాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'మా పాప గురించి మాకు బాగా తెలుసు. ఎంత తిట్టినా హయా చదువుకోదు. మరుక్షణమే ఆడటానికి పరిగెత్తుకు వెళ్తుంది. అందుకే తను కొంతసేపైనా చదువుకొనేలా చూస్తాం' అని తోషి చెప్పాడు.



'హయా ఎంత మొండిదో భర్తకు, సోదరులకు చూపించేందుకు ఆమె తల్లి ఈ వీడియోను చిత్రీకరించింది. తల్లి చదువుకోమని చెప్పినంత సేపే హయా ఏడుస్తోంది. చదువు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తుంది. ప్రతి ఇంట్లో విభిన్న స్వభావాలున్న పిల్లలు ఉంటారు. మా చిన్నారి కాస్తా మొండిది. కానీ తను అంటే మాకు ఎంతో ఇష్టం' అని తోషి చెప్పాడు. కానీ, ఏదిఏమైనా చదువు పేరిట పిల్లలను తీవ్రంగా భయపెట్టడం, బెదిరించడం సబబు కాదని నెటిజన్లు అంటున్నారు.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top