దారుణంగా పడిపోతున్న బంగారం డిమాండ్!

దారుణంగా పడిపోతున్న బంగారం డిమాండ్! - Sakshi

బంగారం కొనుగోలుకు చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. కానీ ఇటీవల భారత్లో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.30వేలకు దిగువన రూ.28,500గా కదలాడుతున్నాయి.  బంగారానికి డిమాండ్ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారని జువెల్లరీ వ్యాపారులు వాపోతున్నారు. 1999లో తన కుటుంబ వ్యాపారాలైన బంగారం బిజినెస్లను స్వీకరించాక, ఈ ఏడాదే బంగారం ధరలు దారుణంగా పడిపోతున్నాయని సౌరభ్ గాడ్గిల్ అనే వ్యాపారవేత్త పేర్కొన్నారు. అదేవిధంగా వినియోగదారులక ఎర వేయడానికి ఎన్ని డిస్కౌంట్లు ఆఫర్ చేసినా వారు కొనడం లేదని, బంగారం పరిశ్రమంతా ఆందోళనలో ఉందని మరో వ్యాపారి తెలిపారు.   

 

ఈ స్థాయిలో బంగారం కిందకు దిగిరావడం, రాబోతున్న హిందూ పండుగలు దీవాళి, ధన్తేరాస్లపై కూడా ఆశలను ఆవిరిచేస్తుందున్నారు. బంగారం కొనుగోలులో ధన్ తేరాస్ ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది వినియోగం ఇంకా 650 మెట్రిక్ టన్నుల కంటే కిందకే నమోదవుతుందని బ్లూమ్బర్గ్ సర్వే తెలిపింది. గతేడాది భారత్ 864 టన్నుల బంగారం కొనుగోలు చేయగా.. 2010లో అత్యధికంగా 1,006 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటాలో తేలింది.   

 

33 ఏళ్ల మార్కెట్లో బంగారానికున్న భౌతిక డిమాండ్ ఎన్నడూ కూడా ఈ మేర తగ్గలేదని జెనీవా ఆధారిత రిఫైనర్, ట్రేడర్ ఎంకేఎస్ చైర్మన్ మార్వాన్ షకర్చీ తెలిపారు. బ్లాక్ మనీపై భారత్ ప్రభుత్వం చేస్తున్న పోరాటమే బంగారం కొనుగోళ్లకు కళ్లెం వేస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్గా కూడా బంగారం ధరలు గత రెండేళ్లలో గరిష్టంగా జూలైలో 8 శాతం మేర పతనమయ్యాయి. మంగళవారం ఒక్క ఔన్స్కు బంగారం ధర 1,268.48 డాలర్లుగా నమోదైంది.   

 

వరల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఈ ఏడాది 750 నుంచి 850 టన్నుల వినియోగం ఉంటుందని అంచనావేసింది. కానీ పలు కారణాలు కొనుగోలను దెబ్బతీశాయి. ఒకటి బ్లాక్ మనీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం, ఐడీఎస్ పథకం ద్వారా బ్లాక్ మనీని ప్రభుత్వం రాబడుతోంది. దీంతో బంగారం కొనుగోలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. రెండోది మార్చి, ఏప్రిల్లో జువెల్లరీ వ్యాపారుల బంద్ కూడా బంగారం డిమాండ్పై ఎఫెక్ట్ చూపింది. అప్పుడు ధరలు ఎగిసినప్పటికీ, కొనుగోలు పడిపోయాయి. కానీ పండుగ సీజన్ దీపావళి కాలంలో, రెండో త్రైమాసికంలో వినియోగం పెరుగుతుందని కౌన్సిల్ డైరెక్టర్ మెంబర్ జాన్  ముల్లిగాన్ అంచనావేస్తున్నారు. మరోవైపు బంగారం డిమాండ్పై  వ్యాపారులు మాత్రం ఒకింత భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. మంచి రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లను కొంత పెంచవచ్చని  ఆశాభావం వ్యక్తంచేస్తున్నప్పటికీ, వినియోగదారులు ఏ మేరకు కొనుగోలు జరుపుతారో అని అనుమాన పడుతున్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top